నిర్మలమ్మా.. సహకరించమ్మా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయంపై ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తో చర్చించినట్లు తెలిసింది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మాలా సీతారామన్ ను కోరారు. చంద్రబాబు నాయుడు వెంట కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, సీఎం రమేష్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
నవంబరులో జరిగే...
దీంతో పాటు ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ తో చర్చించారు. ఈ సదస్సుకు ఆర్థిక శాఖమంత్రిగా తాను హాజరవుతానని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు చర్చించారు. అంత్యోదయ పథకంపై కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించినట్లు సమాచారం. ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిసింది.