Andhra Pradesh : పేదరిక నిర్మూలన ధ్యేయంగానే పనిచేస్తాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు

Update: 2025-08-15 05:16 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా తనను అనుభవం చూసి, అభివృద్ధిని చూసి గెలిపించారన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడిందని చంద్రబాబు అన్నారు. పది లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపడమే కాకుండా అభివృద్ధి ఎంతమాత్రం చేయలేదని చంద్రబాబు అన్నారు.

తిరిగి తమపై నమ్మకంతోనే...
2024 ఎన్నికల్లో తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారన్న నమ్మకంపై కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఏడాది కాలం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకవైపు అమలు చేస్తూనే మరొక వైపు తరలిపోయిన పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను నిలిపేసిందన్న చంద్రబాబు నాయుడు తిరిగి వాటిని నిర్మించే పనిలో ఉన్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీరు అందడమే కాకుండా, బనక చర్ల వంటి పథకాలతో రాయలసీమకు కూడా సాగు నీరు అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
టాప్ త్రీ రాష్ట్రాల్లో...
దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని తెలిపిన చంద్రబాబు నాయుడు నాశనం అయిపోయిన ఏపీ బ్రాండ్ ను తిరిగి తెప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అన్నీ ఇన్నీ కావని, కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చకుండా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని చంద్రబాబు తెలిపారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తోన, 57 శాతం ఓటు షేర్ తోనూ ఏర్పడిన కూటమి ప్రభుత్వంఏడాది పాలనలో అన్ని హామీలను నెరవేర్చామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా రాష్ట్రాన్ని తీసుకెళుతున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. భవిష్యత్ లోనూ తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పేదరిక నిర్మూలన దిశగా ప్రయత్నం చేస్తుందని అన్నారు. అందుకే పీ4 పథకాన్ని ప్రవేశపెట్టామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.


Tags:    

Similar News