Chandrababu : ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే.. సీటు చిరిగి పోద్ది..ఎమ్మెల్యేలూ జర జాగ్రత్త

Chandrababu : ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే.. సీటు చిరిగి పోద్ది..ఎమ్మెల్యేలూ జర జాగ్రత్త

Update: 2025-08-18 08:59 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునుపటి మాదిరిలా లేరు. కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు వెనకాడటంలేదు. అది పార్టీ నేతలు కావచ్చు. అధికారులు కావచ్చు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా పనిని బట్టి మాత్రమే చంద్రబాబు నాయుడు వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను వేగంగా అందిపుచ్చుకుని వెళ్లడంతో పాటుగా ముందుగా వెళ్లడమే కాదు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి వెళ్లగలిగేలా చూడగలగాలి. అలా కాకుండా నామ్ కే వాస్తే చేసిన వారిని ఎంపిక చేసి అవసరమైతే వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంచడానికి కూడా సిద్ధమవుతున్నారు.

పంతాలకు పోయి...
ముఖ్యంగా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు పట్టుదలలు, పంతాలకు పోవడంతో పాటు కనీసం అవగాహన లేకుండా వ్యవహరించడం పార్టీకి తలనొప్పిగా తయారయింది. ఎమ్మెల్యేలు కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లకు కూడా గౌరవం ఇవ్వకుండా సోషల్ మీడియాకు ఎక్కుతుండటంతో పార్టీ పరువు బజారున పడుతుంది. ఇటువంటి వారిని కంటిన్యూ చేస్తే అసలుకే ఎసరు వస్తుందని చంద్రబాబు నాయుడుకు తెలియంది కాదు. అందుకే ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నప్పటికీ తలెగరేసి, కాలరెగరేసే నేతలను మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి వల్ల పార్టీకి జరిగే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువని భావించినప్పుడు అంతకు మించిన కార్యాచరణ మరొకటి ఉండదు.
జనంలో కలవని...
సీనియర్ నేతలయిన దేవినేని ఉమ వంటి వారికి కూడా టిక్కెట్ ఇవ్వకపోయినా వారు పార్టీ లైన్ ను థిక్కరించడం లేదు. అలాంటిది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ లైన్ ను థిక్కరించడాన్ని మాత్రం చంద్రబాబు సహించలేకపోతున్నారు. మంత్రుల్లో కూడా కొందరు ఇలాగే వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వానికే మచ్చ తెచ్చి పెట్టేదిగా ఉంది. రాయలసీమ జిల్లాలు ఇందులో ముందున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఒకింత సీనియర్లకు గౌరవమిస్తూ, పార్టీ నేతలను కలుపుకుపోతున్నా వారు జనంలో కలవలేకపోవడం నష్టాన్ని తెచ్చిపెడుతుండటం ఎఫ్పటికప్పుడు నివేదికలు తెప్పించి పెట్టుకుంటున్నారు. వరసగా తప్పులను లెక్క వేస్తూ అవసరమైన సమయంలో నొక్కేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి ఎమ్మెల్యేలూ ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే.. సీటు చిరిగిపోవడం ఖాయమట. చూడండి మరి.


Tags:    

Similar News