Andhra Pradesh : బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయో? ఇదే ఏపీలో హాట్ టాపిక్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంకా బడ్జెట్ సమావేశాలకు మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. 24వ తేదీన పది గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్చి 3వ తేదీన బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బిజినెస్ట అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. అంతకు ముందు రోజు ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈసదస్సుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులు హాజరుకానున్నారు.
మూడు లక్షలకోట్లకు పైగానే...
సరే.. ఇవన్నీ పక్కనపెడితే బడ్జెట్ పై ఇప్పటికే అధికారులు కసరత్తులు చేశారు. ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో సమావేశమై ఏ ఏ శాఖలకు నిధులు కేటాయింపులు జరపాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 - 25 సంవత్సరానికి 2.95 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించి గత శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయంగా 2,35,916 కోట్లు, మూలధన వ్యయంగా 32,712 కోట్ల రూపాయలుగా చూపించింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది.
ఎన్నికల హామీలకు...
అయితే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు నిధుల కేటాయింపుపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వరసగా మూడు నెలలకు మూడు హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. మార్చి నెలలో మహిళలకు బస్సు ప్రయాణం, ఏప్రిల్ నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ, మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాలను అమలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. ఈ మూడు పథకాలకు సంబంధించి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పథకాలకు సంబంధించి ఇంత వరకూ విధివిధానాలను ఖరారు చేయకపోవడంతో పాటు నిధులు ఎంత కేటాయిస్తారన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది.
బాబు డ్రీమ్ ప్రాజెక్టులకు...
మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించాలి. కేవలం పోలవరానికి మాత్రమే కాకుండా బనకచర్లకు కూడా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. బనకచర్ల ను చంద్రబాబు గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తుండటంతో దానికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరొక వైపు సంక్షేమ పథకాలకు కూడా పెద్దయెత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. బడ్జెట్ లో కేటాయింపులను బట్టే అవి అమలవుతాయా? లేదా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అందుకే మార్చి 3వ తేదీన ప్రవేశ పెట్టే బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏంచేస్తుందన్నది చూడాలి.