TDP: మహానాడును తక్కువగా అంచనా వేయొద్దు.. పదవులను తెచ్చి పెట్టే వేదిక

తెలుగుదేశం పార్టీ స్ధాపించి దాదాపు నాలుగు దశాబ్దాలు కావడంతో అక్కడ పుట్టి.. పెరిగిన రాజకీయ నేతలు తర్వాత మంచి స్థానంలోకి వెళ్లారు

Update: 2025-05-27 06:28 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ స్ధాపించి దాదాపు నాలుగు వసంతాలు కావడంతో అక్కడ పుట్టి.. పెరిగిన రాజకీయ నేతలు తర్వాత మంచి స్థానంలోకి వెళ్లారు. కొందరు ముఖ్యమంత్రులు కాగా, మరికొందరు కీలకమైన మంత్రి పదవులను దక్కించుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి బయటకు వెళ్లిన వారు ఇతర పార్టీల్లో చేరి మంత్రులుగా చేరిన వారు అధికంగా కనిపించే వారు. కానీ ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే మంత్రులు, ముఖ్యమంత్రులుగా అధికంగా ఉండటం కనిపిస్తుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లు వివిధ కారణాలతో పార్టీ మారి ముఖ్యమంత్రులగానో, మంత్రులుగానో మారిపోయారు.

మహనాడులో పాల్గొని...
తాజాగా మహానాడు కడపలో జరుగుతున్న సమయంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడు ప్రారంభమయింది. నాడు మహానాడులో పాల్గొని తర్వాత రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్లిన వారు, అమాత్యపదవులు అందుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది పొలిటీషియన్స్ తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్ది తర్వాత ఎదిగి బుగ్గకార్లు ఎక్కిన వారు అనేక మంది ఉన్నారు. మహానాడులో ఇది చర్చనీయాంశంగా మారింది. అతెందుకు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రులు అయిన ఇద్దరూ టీడీపీకిచెందిన వారే. కేసీఆర్, రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వచ్చిన వారే.
రెండు తెలుగు రాష్ట్రాల్లో...
నాడు జరిగిన మహానాడులో వారు చేసిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే నేటి తరం రాజకీయ నేతలకు మహానాడుతో విడదీయరాని బంధం ఉంది. నాడు మహానాడు వేదికపై ఉన్న రోజా, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, విడదల రజిని వంటి వారు వైసీపీ హయాంలో మంత్రులయ్యారు. ఇక కేసీఆర్ పదేళ్లు పాటు అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ లో ఉన్న వారిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చిన వారే. గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క వంటి వారు కూడా టీడీపీ నుంచి ఓనమాలు నేర్చుకుని వచ్చిన వారే. అందుకే టీడీపీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎదిగేందుకు వేదికగా మారిందని చెప్పాలి.


Tags:    

Similar News