Alla Nani : పార్టీ మారితే కేసులుండవ్ గాని... క్యాడర్ ఉంటుందా?
మాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో కంఫర్గ్ గా లేరు.
రాజకీయాలు అంతే... రాజకీయాల్లో ఓపిక.. సహనం అవసరం.. అధికారం లేకపోతే పార్టీ మారితే ఎవరూ కేర్ చేయరు. పక్కన ఉండే నలుగురైదుగురు కోటరీ నాయకులు తప్ప ఎవరూ పెద్దగా కలిసేందుకు కూడా ఆసక్తి చూపరు. ప్రస్తుతం మాజీ మంత్రి ఆళ్లనాని పరిస్థితి అలాగే తయారైంది. ఆళ్ల నాని వైసీపీలో ఒక వెలుగు వెలిగారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవి పొందారు. అలాగనుకుంటే వైసీపీ అధికారంలోకి రాకముందే ఆళ్లనానిని జగన్ ఎమ్మెల్సీ చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చీఫ్ జగన్ తన కేబినెట్ లో చోటు కల్పించడమే కాకుండా మొదటి విడతలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆళ్లనాని వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు.
కండువా కప్పుకున్నా...
తొలి నుంచి ఆళ్ల నాని టీడీపీ చేరికకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. ఏలూరు జిల్లా టీడీపీ నేతలు ఆళ్ల నాని పార్టీలో చేరికపై తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పలు సార్లు ఆయన చేరికకు బ్రేకులు పడినా చివరకు పార్టీ నాయకత్వం ఏలూరు జిల్లా నాయకులకు నచ్చ చెప్పి పార్టీ కండువా కప్పేసింది. సీనియర్ నేతల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ ఆళ్ల నాని పార్టీలో చేరడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోవడం లేకపోతున్నారు. అసలు జిల్లాలో ఆళ్లనాని అంటూ ఒక నేత ఉన్నారన్న విషయం ఇటు టీడీపీ నేతలతో పాటు ఆయన అనుచరులు కూడా మర్చిపోయారట. ఏలూరు జిల్లాను ఒకప్పుడు వైసీపీ హయాంలో శాసించిన నాని ఇప్పుడు వేళ్లు విరుచుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. పార్టీలో చేరి ఎనిమిది నెలలు కావస్తున్నా బయటకు రావడం లేదు.
నాయకుడిగా గుర్తించకపోవడంతో...
చివరకు పార్టీ కార్యక్రమాలకు కూడా ఆళ్లనానికి పిలుపులు లేవు. అసలు ఆళ్లనానిని తమ నాయకుడిగా టీడీపీ నేతలు గుర్తించడం లేదు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమపై పెట్టిన అక్రమ కేసులకు ఆళ్ల నాని ప్రధాన కారణమని భావించడం వల్లనే అంతటి వ్యతిరేకతను టీడీపీ క్యాడర్, లీడర్ల నుంచి ఆళ్ల నాని ఎదుర్కొంటున్నారు. అలాగని నిన్న గాక మొన్న పార్టీలో చేరి స్థానిక నాయకత్వం తీరుపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆళ్ల నాని అనవసరంగా పార్టీ మారానా? అన్న బాధలో ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో ఆళ్ల నానికి టీడీపీ టిక్కెట్ దొరకడం కూడా కష్టమేనని అంటున్నారు. దీంతో ఆళ్లనాని మరొకసారి జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటున్నారు.