Bhuma Akhila Priya : టీడీపీ హైకమాండ్ కు భూమా మాస్ వార్నింగ్.. వారికి పదవులు ఇచ్చారో?
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పార్టీ అధిష్టానినికి అల్టిమేటం ఇచ్చారు
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పార్టీ అధిష్టానినికి అల్టిమేటం ఇచ్చారు. తమకు తెలియకుండా నియోజకవర్గంలో ఎవరికి పదవులు ఇచ్చినా ఊరుకోబోమని తేల్చి చెప్పారు. వారిని ఊరిలోకి కూడా అడుగుపెట్టనివ్వబోమని చెప్పారు. తమ అనుమతి తోనే పదవులను పంపిణీ చేయాలని అన్నారు. తాను సిఫార్సు చేసిన వారికి, పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. పదవులు అమరావతిలో డిసైడ్ అవ్వడానికి వీలు లేదని అఖిలప్రియ తేల్చిచెప్పారు. స్థానిక ఎమ్మెల్యేగా తమ అనుమతి లేకుండా ఎవరికంటే వారికి పదవులు ఇస్తే తాను అంగీకరించకబోనని కూడా అఖిలప్రియ హైకమాండ్ వార్నింగ్ ఇచ్చారు.
ఏవీ ని ఉద్దేశించేనా?
అయితే భూమా అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చింది కేవలం ఏవీ సుబ్బారెడ్డి విషయంలోనే అని చెప్పకనే తెలుస్తుంది. గతంలో 2014లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవిని పార్టీ నాయకత్వం కట్టబెట్టింది. ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఉప్పందడంతో అఖిలప్రియ ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఏవీ సుబ్బారెడ్డికి ఏ పదవి ఇచ్చినా తాను అంగీకరించబోనని నేరుగా చెప్పకుండా ఈ రకమైన వార్నింగ్ ను అమారావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టులను మహానాడులోపు భర్తీ చేస్తానని ప్రకటించడం, అనేక పోస్టుల భర్తీ అవుతుండటంతో అఖిలప్రియ ఈ ప్రకటన చేశారంటున్నారు.
తొలి నుంచి ఉన్న వారికే...
భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమైంది. ఆళ్లగడ్డలో జరిగిన మినీ మహానాడులో ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి అంకితమైన వారికి, తమకు అంకిత మైన వారికి మాత్రమే పదవులు ఇవ్వాలని అన్నారు. ముక్కూ మొహం తెలియని వాళ్లు ఏదైనా పదవి తీసుకుంటే మాత్రం తాను అంగీకరించబోనని తెలిపారు. పార్టీ నుంచి మొదటి నుంచి పనిచేస్తున్న వారికి, తొలి నుంచి ఉన్న వారికి పదవులు ఇవ్వాలని అఖిలప్రియ కోరారు. అంతే తప్ప పైరవీలు చేసుకుని వచ్చే వారిని ప్రోత్సహిస్తే ఊరుకోబోమని కూడా మినీ మహానాడు వేదికగా ఆమె గట్టి వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతుంది. మరి అఖిలప్రియ కామెంట్స్ ను హైకమాండ్ ఏ రకంగా తీసుకుంటుందన్నది చూడాలి.