Adimulapu Suresh : నమ్మకంగా చేరదీసి పదవులిస్తే... కష్టకాలంలో హ్యండ్ ఇచ్చారటగా?
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం యాక్టివ్ గా ఉండటం లేదు
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం యాక్టివ్ గా ఉండటం లేదు. ఆదిమూలపు సురేష్ వైసీపీ హయాంలోని ఐదేళ్లలో కొన్నాళ్లు విద్యాశాఖ మంత్రిగానూ, మరికొన్నాళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగానూ ఉన్నారు. అయితే ఆయన ప్రభుత్వం మారిన తర్వాత తాను ప్రాతినిధ్యం వహించిన శాఖలకు సంబంధించిన విమర్శలు అధికార పార్టీ నుంచి వచ్చినప్పటికీ ఆయన స్పందిచడం లేదు. పైగా ప్రస్తుతం యర్రగొండపాలెంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారారంటున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై తన అనుచరులతో సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మూడు సార్లు గెలిచి...
ఆదిమూలపు సురేష్ 2009, 2014, 2019, 2024 లలో జరిగిన ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. నాలుగు సార్లు పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు.ఆదిమూలపు సురేష్ దక్షిణ మధ్య రైల్వేలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. తర్వాత వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2009 లో కాంగ్రెస్ తరుపున యర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయనకు యర్రగొండపాలెం అంటేనే ఎక్కువ మక్కువ. అక్కడే తన రాజకీయాలను కొనసాగించాలని గట్టిగా అనుకుంటున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయనను యర్రగొండపాలెం నుంచి తప్పించి కొండపి నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అక్కడ ఓటమితో ఇక కొండపి నియోజకర్గం నుంచి క్యాడర్ కు కూడా దూరంగా ఉన్నారు.
నమ్మకంగా భావించి...
2009లో యర్రగొండపాలెం నుంచి పోటీచేసిన ఆదిమూలపు సురేష్ తొలిసారి గెలిచారు. అయితే వైఎస్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన జగన్ తో కలసి ప్రయాణం చేయాలని నిర్ణయించారు. జగన్ 2014 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ ను సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అప్పడు అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్ ను మళ్లీ యర్రగొండపాలెంకు జగన్ పంపించి అక్కడి నుంచి పోటీ చేయించారు. అక్కడి నుంచి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. రెండున్నరేళ్ల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆదిమూలపు సురేష్ ను జగన్ కేబినెట్ లో కొనసాగించారు. అయితే ఈసారి విద్యాశాఖ కాకుండా మున్సిపల్ శాఖకు మార్చారు. ఆదిమూలపు సురేష్ కారణంగానే తన సొంత బంధువును బాలినేనిని కూడా జగన్ పక్కన పెట్టారు.
హైదరాబాద్ కే పరిమితం...
జగన్ సొంత జిల్లా అయిన కడపకు ఆయనను ఇన్‌ఛార్జి మంత్రిగానూ నియమించారు. అంత నమ్మకాన్ని జగన్ సురేష్ పై ఉంచారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తనను యర్రగొండపాలెం నుంచి కొండపి పంపించడంపై ఆయన కొంత ఇబ్బంది ఫీలవుతున్నారు. 2024 ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ నుంచి గెలవడంతో అక్కడకు కూడా వెళ్లలేక హైదరాబాద్ కే ఆదిమూలపు సురేష్ పరిమితమయ్యారంటున్నారు. అయితే తనకు బలమైన అనుచరులు, క్యాడర్ ఉన్న యర్రగొండ పాలెంలో ఆదిమూలపు సురేష్ వేలు పెడుతుండటం, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేయడంతో పార్టీ నాయకత్వం కూడా సీరియస్ కావడంతో ఇక ఏపీ రాజకీయాలకు ఆదిమూలపు సురేష్ దూరంగా ఉన్నారని తెలిసింది. ఐదేళ్లు మంత్రి పదవి ఇచ్చినా జగన్ కు కష్టకాలంలో మాత్రం దూరంగా ఉండిపోయిన ఆదిమూలపు సురేష్ పై వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.