AB Venkateswara Rao : ఏబీ ఎందుకిలా.. టీడీపీకి నష్టం చేకూర్చాలనేనా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి అందులోనూ టీడీపీకి తలనొప్పిగా తయారయ్యాయి. ఆయన మాజీ పోలీసు అధికారిగా ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ సామాజికవర్గం కోణంలో చూసే వారికి ఏబీ టీడీపీకి నష్టం చేకూర్చే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కందుకూరు ఘటన అమానుషం. ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. కులాలు, మతాలు పక్కన పెడితే మానవీయ కోణంలో ఆలోచించాల్సిన ఘటన అది. వాహనంతో తొక్కించి ఒకరి మృతికి కారణమై, మరొక ఇద్దరు యువకులు తీవ్రగాయాలు పాలయిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించింది. ఏబీ పంటికింద రాయిలా మారారు.
రాజకీయ రంగు పులుముకుని...
అయితే అది రాజకీయ రంగు పులుముకుంది. బాధితులు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడం, హత్య చేసింది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై నిందితులను అరెస్ట్ చేసింది. బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిజానికి మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయమిది. హత్యకు కారణాలు ఏవైనా ఉండవచ్చు గాక, హత్య జరిగిన తీరు అమానుషమని ప్రతి ఒక్కరూ ఖండించారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా బాధితుల కుటుంబానికి పరిహారం ప్రకటించారు.
ఏబీ కామెంట్స్ పై...
అయితే ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం ఈ ఘటనపై స్పందించిన తీరు ఆక్షేపణీయంగా ఉందంటున్నారు. ఇలా హత్య జరిగిన వారందరికీ పరిహారం అందించుకుంటూ పోతే ప్రజాధనం వృధా చేసినట్లేనని, ఎవరి సలహాతో పరిహారం ఉత్తర్వులు జారీ చేశారని ప్రశ్నించారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడమేంటని నిలదీశారు. దీనిపై కాపు సంఘం నేత దాసరి రాము మండిపడ్డారు. మరి రాజకీయ గొడవల్లో మరణించిన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినప్పుడు నోరు పెగలలేదేం అని ప్రశ్నించారు. దీనికి జీవో ఇవ్వడం సబబేనా? అని నిలదీశారు. మొత్తం మీద ఏబీ వెంకటేశ్వరరావు సైకిల్ పార్టీకి విలన్ గా మారిపోయాడు. ఆయన ఏదోఒకటి రచ్చ చేయడం అది ప్రభుత్వానికి చుట్టుకోవడం పట్ల టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు. సీనియర్ ఐపీఎస్ అయిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు.