చిల్లర కోసం గొడవ.. చేయి చేసుకున్న మహిళా కండక్టర్
ప్రయాణికుడిపై ఆర్టీసీ మహిళా కండక్టర్ దాడికి పాల్పడింది.
ప్రయాణికుడిపై ఆర్టీసీ మహిళా కండక్టర్ దాడికి పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. చిల్లర విషయంలో తలెత్తిన చిన్న వివాదం, వృద్ధుడిపై చేయి చేసుకునే వరకు వెళ్లింది. తోట్లవల్లూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్దిబోయిన మల్లిఖార్జునరావు అనే వృద్ధుడు ఉయ్యూరు వెళ్లేందుకు బస్సు ఎక్కారు. టికెట్ కోసం ఆయన కండక్టర్‌కు 200 రూపాయల నోటు ఇవ్వగా, చిల్లర లేదని, పెద్ద నోటు ఇస్తే ఎలాగని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మహిళా కండక్టర్, తోట్లవల్లూరు కనకదుర్గ కాలనీ వద్ద బస్సును ఆపి మల్లిఖార్జునరావును కిందకు దింపేశారు. నన్నే తిడతావా అంటూ ఆయనపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన మచిలీపట్నం ఆర్టీసీ డీఎం, ఉయ్యూరు డిపో ఇన్‌ఛార్జి డీఎం పెద్దిరాజు ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.