పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన 6వ తరగతి విద్యార్థిని

గుంటూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మి (11) అనే బాలిక బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరవ తరగతి..

Update: 2023-05-08 04:59 GMT

ఆరవ తరగతి బాలిక.. ఇటీవల విడుదలైన ఏపీ 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో తన ప్రతిభ చాటింది. ఏకంగా 566 మార్కులు సాధించి.. అందరిచేత ప్రశంసలందుకుంటోంది. గుంటూరుకు చెందిన చిర్రా అనఘాలక్ష్మి (11) అనే బాలిక బ్రాడీపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి విష్ణువర్థన్ రెడ్డి మంగళగిరిలోని స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి సత్యదేవి ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేశారు. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచే అనఘాలక్ష్మి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ లో ప్రతిభ కనబరుస్తోంది.

గణిత అవధానాల్లో శతావధాన స్థాయికి చేరుకుంది. చిత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ బాలిక ప్రతిభకు మంత్రి ఆదిమూలపు సురేష్ ముగ్ధులై.. ఆమెతో 10వ తరగతి పరీక్షలు రాయించాలని సూచించారు. ఉన్నతాధికారుల అనుమతితో 2022-23 విద్యాసంవత్సరానికి నిర్వహించిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసింది. మే 6న విడుదలైన ఫలితాల్లో బాలిక 566 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. కాకినాడకు చెందిన ఆరవ తరగతి విద్యార్థిని ముప్పల హేమశ్రీ కూడా 10 పరీక్షల్లో 488 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.


Tags:    

Similar News