Ys Jagan : నకిలీ మద్యంలో అసలు నిజాలివే
ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థీకృతంగా కల్తీ మద్యం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థీకృతంగా కల్తీ మద్యం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గతంలో ఎన్నడూ ఈ రకమైన మద్యం అమ్మకాలు జరగలేదన్నారు. రాష్ట్రంలో మాఫియా లిక్కర్ షాపుల ద్వారానే విక్రయాలు జరుపుతున్నారని జగన్ ఆరోపించారు. గత టెండర్లలో ఏ రకంగా వారికి మద్యం దుకాణాలు వచ్చాయన్నది అందరికీ తెలుసునన్నారు. వారి మద్యం షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా ఈ మాఫియా ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయని జగన్ అన్నారు. బెల్ట్ షాపులే కాకుండా అనధికార పర్మిట్ రూమ్ ల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తూ మద్యం మాఫియా నడుస్తుందని అన్నారు.
వాటాల్లో తేడా రావడంతో...
వాటాల్లో తేడా రావడంతో ఈ కల్తీ మాఫియా బయటకు వచ్చిందని జగన్ తెలిపారు. ఒక్క ములకల చెరువులోనే 20, 282 సీసాల నకిలీ మద్యాన్ని పట్టుకున్నారని జగన్ అన్నారు. ఇంకా సిద్ధం చేసి ఉన్న నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ పట్టుకుందన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారో.. ఏ పోలీస్ కమిషనర్ అయితే తమ పార్టీ వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారో.. అదే సీపీ తనిఖీలో ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం బయటపడిందని జగన్ విమర్శించారు. రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా పరవాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరు లో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న కేంద్రాలు బయటపడ్డాయని జగన్ అన్నారు. డబ్బుల కోసం దిగజారి రాజకీయం చేస్తున్నారని జగన్ అన్నారు.
అందరూ టీడీపీ వాళ్లే...
ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయడంలో చంద్రబాబు, ఆయన కొడుకుకు మాత్రమే సొంతమని వైఎస్ జగన్ విమర్శించారు. రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం టాపిక్ ను డైవర్ట్ చేయడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మొదలు పెట్టారన్నారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నది తంబళ్లపల్లి టీడీపీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డి, జనార్థన్ రావు, సురేంద్ర నాయుడు అందరూ టీడీపీకి చెందిన వారేనని జగన్ అన్నారు. జనార్థన్ రావు విదేశాల్లో ఉండగానే లొంగిపోతారంటూ లీకులు వదిలారని, ఇక్కడకు వచ్చిన తర్వాత జనార్థన్ రావు రెండున్నరేళ్ల నుంచి మద్యం తయారీ చేస్తున్నానని చెప్పించడం, ఆఫ్రికాలో మూలాలున్నాయంటూ కధను సృష్టించారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి కేసును పక్కదోవ పట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారన్నారు. జోగిరమేష్ తో ఫోన్ లో చాట్స్ అంటూ దుష్ప్రచారం చేస్తూ మరొకరిపై బురద చల్లే ప్రయత్నం చేశారని అన్నారు. ఫోన్ పోయిందని చెప్పిన జనార్థన్ నుంచి ఇవి ఎలా సాధ్యమయిందని జగన్ ప్రశ్నించారు. జయచంద్రారెడ్డిని ఇంత వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.