Tirumala : తిరుమలకు నేడు వెళ్లేవారికి అలెర్ట్... దర్శనానికి?
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగానే ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి రద్దీ విపరీతంగా ఉంది. కానీ మోంథా తుపాను ప్రభావంతో కొంత రద్దీ తగ్గిందనే చెప్పాలి. భారీ వర్షాలతో పాటు బస్సులు, రైళ్లు రద్దు కావడంతో పాటు కొన్ని రూట్లలో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో భక్తుల సంఖ్య నేడు కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటం ఇదే తొలిసారి అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం ఎలాగోలా తిరుమలకు చేరుకుంటున్నారు.
ఘాట్ రోడ్ లో ప్రమాదాలు జరగకుండా...
అయితే భారీ వర్షాలతో తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదాలు జరగకుండా టీటీడీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మలుపుల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని, కొండ చరియలు విరిగి పడే అవకాశముందని హెచ్చరిస్తూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఘాట్ రోడ్డులో ప్రయాణాన్ని సుఖవంతంగా చేయాలంటే మితిమీరిన వేగం కాకుండా నిర్దేశించిన వేగం మేరకే కొండపైకి చేరుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సొంత వాహనాలతో వచ్చే ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి నేడు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారిదర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,065 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,250 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.57 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.