Tirumala : తిరుమలలో నేటి రద్దీ ఎలా ఉందంటే.. దర్శన సమయం?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు

Update: 2025-10-31 03:01 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. భారీ వర్షాలతో పాటు రహదారులు రాకపోకలకు పలు ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారడంతో ముందుగా తిరుమల దర్శనం కోసం బుక్ చేసుకున్న వారు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. గత ఐదు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. పొరుగు జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు తో పాటు తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ రేపు పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.

అత్యధిక సంఖ్యలో...
తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తారు. అందుకే దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు నిత్యం తిరుమలకు చేరుకుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. గతంలో కేవలం వేసవి కాలంలో మాత్రమే రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటం, ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభించడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఇటీవల పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,078 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 17,539 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News