Tirumala : నేడు తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. ఇటీవల కాలంలో తక్కువ సంఖ్యలో భక్తుల రద్దీ ఉండటం ఈరోజు మాత్రమే. అయితే మధ్యాహ్నానికి భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఎందుకంటే రేపటి నుంచి శుక్రవారం, శనివారం కావడంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశాలున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
హుండీ ఆదాయం కూడా...
ఇటీవల కాలంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. హుండీ ఆదాయం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు 120 కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వస్తుంది. లడ్డూల విక్రయాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాది మే15వ తేదీన ప్రారంభమైన భక్తుల రద్దీ నిన్నటి వరకూ కొనసాగింది. భక్తులు స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రానున్న కాలంలో తిరుమలలో భక్తుల రద్దీ మరితం ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు.
పది కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,121 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,426 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.