Tirumala : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు. కార్తీక సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి చెంతకు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్తీక మాసం కావడంతో పాటు పలు రూపాల్లో వస్తున్న భక్తులతో తిరుమల కొండ నిండిపోయింది. తిరుమలలోని వసతి గృహాలు దొరకడం కూడా కొంత ఆలస్యమవుతుంది. తిరుమలకు భక్తుల రద్దీ నిత్యం కొనసాగుతుందని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
అత్యధికంగా వస్తుండటంతో...
పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు పండగల సీజన్ కూడా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇక తిరుమలలో వచ్చే నెలలో వైకుంఠ ద్వార దర్శనం కూడా ఉండటంతో భక్తుల సంఖ్య ఈ మూడు నెలల పాటు ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేసి అందుకు అనుగుణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు క్యూ లైన్ లలో ఇబ్బందులు పడకుండా అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలను కూడా భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో కి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుందని తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,217 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,000 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు.