కొండెక్కిన కోడిగుడ్లు...మండిపోతున్న మాంసం ధరలు
రోజు రోజుకు చికెన్, మటన్, గుడ్ల ధరలు పెరుగుతున్నాయి.
రోజు రోజుకు చికెన్, మటన్, గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. కనుమ పండగ కావడంతో ధరలు అదిరిపోతున్నాయి. చలికాలంలో వీటి వినియోగం ఎక్కువ కావడంతో ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు మండిపోతున్నాయి. కొనుగోలు చేయాలంటేనే కష్టంగా మారుతుందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ 300 నుంచి 350 రూపాయలకు ధరలు చేరాయి. గుడ్డు ధర ఏకంగా ఎనిమిది రూపాయలకు చేరింది. కేవలం వారంలోనే కిలో చికెన్ పై 50 రూపాయలు పెరిగింది. కార్తీకమాసం ముగిసినప్పటి నుండి చికెన్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇలా క్రమంగా వారం వారం కిలో చికెన్ పై యాభై నుంచి డెబ్భయి రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం కేజీ స్కిన్ చికెన్ 350 కాగా.. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.350 నుండి 380 పలుకుతుంది.
డిమాండ్ పెరగడంతో...
చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో చికెన్, కోడిగుడ్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. సంక్రాంతి కనుమ రోజున వీటి ధరలు మరింత పెరిగాయి. చికెన్ , మటన్ తో పాటు చేపలు, రొయ్యలు ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు గుడ్ల ధరలు కూడా పెరగడంతో గుడ్డు సామాన్యులకు దూరమయిందనే చెప్పాలి. మరొకవైపు నిత్యవసరాలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతుండటంతో పేదవాడి ఆరోగ్యకరమైన ఫుడ్డు.. గుడ్డు కూడా మరింత ఆర్థిక భారాన్ని తెచ్చిపెడుతుంది. కూరలో ఏమి లేకపోయినా ఒక్క గుడ్డుతో భోంచేసి వెళ్లిపోయేవారు నేడు అంత ధరపోసి కొనుగోలు చేయలేకపోతున్నామంటున్నారు.
ఉత్పత్తి కూడా పడి పోవడంతో...
డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేకపోవడంతో సరఫరా దెబ్బతిని ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. చికెన్ రేట్లు కిలో రూ.350 నుంచి రూ.400 వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద కనుమ పండగ నాటికి ధరలు మధ్యతరగతి ప్రజలకు రోజున అందుబాటులో ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది. చికెన్, మటన్, కోడిగుడ్లు వంటివి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక విద్యార్థులకు పౌష్టికాహారంగా ప్రభుత్వం కోడిగుడ్డు అందిస్తుంది. అయితే ప్రభుత్వం కాంట్రాక్టర్ కు ఆరు రూపాయలే చెల్లిస్తుండగా, ఇప్పుడు ఎనిమిది రూపాయలు కావడంతో చదువుకునే విద్యార్థులకు కూడా కోడిగుడ్డు దూరమయిందని, అందుకు ధరలు పెరగడమే కారణమని చెబుతారు.