Andhra Pradesh : నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ లో నేడు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. రేపు జనవరి 1వ తేదీ కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొంటారు.
ఒకరోజు ముందుగానే...
లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 63.12 లక్షల మందికి నేడు పింఛన్లను పంపిణీ చేయనుంది. ఇందుకోసం 2,743 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈరోజు పింఛన్లు అందని వారికి వచ్చే నెల 2వ తేదీన ఇళ్లకు వెళ్లి అందచేస్తారు.