Weather Report : వానలు కురుస్తూనే ఉంటాయట.. ఎన్ని రోజులంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఈ ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వానలు పడతాయని తెలిపింది. అయితే మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. వానలు కురుస్తున్నందున రైతులు ముందు జాగ్రత్తలు తీసుకుని తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
తేలికపాటి జల్లులు.
ఆంధ్రప్రదేశ్ లోనూ మూడు రోజుల పాటు వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడించింది. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. నదులు, వాగులు ప్రమాదకరంగా ఇప్పటికీ ప్రవహిస్తున్నందున వాటిని దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, రైతులు, పశువుల కాపర్లు పొలాలకు వెళ్లినప్పుడు చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నేడు ఈ జిల్లాల్లో వానలు...
తెలంగాణలోనూ మూడు రోజలు పాటు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఉత్తర తమిళనాడు మీదుగా కొనసాగుతున్నందున తెలంగాణలోనూ మూడు రోజులు వర్షాలు పడతాయని చెప్పింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, మేడ్చల్ రంగారెడ్డి, హైదరాబాద్ లో మోస్తరు వానలుపడే అవకాశముందని తెలిపింది.