Cyclone Alert : ఫ్లాష్ ఫ్లడ్స్ .. తుపాను కలిపి ముంచేస్తుందా?

మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

Update: 2025-10-28 01:56 GMT

మొంథా తుపాను వేగంగా దూసుకు వస్తుంది. ఈరోజు మధ్యాహ్నానికి కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొంథా తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందస్తు చర్యలకు సిద్ధమయింది. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడమే కాకుండా పునరావాస కేంద్రాలను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ఇళ్ల నుంచి మూడు రోజుల పాటు బయటకు రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో ఈ ప్రాంతాల వారు...
మొంథా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని కూడా విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కుండ పోత వానలు పడి మునిగిపోయే అవకాశముందని చెప్పింది. కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలెర్ట్ జారీ చేసింది. ఎవరూ చెట్లు, పురాతన భవనాలు, హోర్డింగ్ లు, విద్యుత్తు స్థంభాల వద్ద నిలబడవద్దని సూచించింది. మూడు రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది.
తెలంగాణలో నాలుగు రోజులు...
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వీటితో పాటు నాగర్ కర్నూల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు నదులు, వాగుల్లో దిగే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News