జగన్ ‘ప్రత్యేక’త అదే మరి!

Update: 2016-10-14 11:59 GMT

విపక్షనాయకుడ వైఎస్ జగన్మోహన రెడ్డి అసలు పాయింటు మరవలేదు. సర్వకాల సర్వావస్థల్లోనూ తన దీక్ష ఒకటే అని శుక్రవారం నాడు కూడా నిరూపించుకున్నాడు. నెల్లూరు జిల్లా బారాషహీద్ దర్గా వద్ద ప్రార్థనలు చేసి, రొట్టెల పండుగలో పాల్గొన్నతను ప్రస్తుతం భుజానికెత్తుకుని పోరాడుతున్న అంశం ప్రత్యేకహోదా అనేది మరువలేదు. ఆయన రొట్టెలపండుగలో ‘ప్రత్యేకహోదా’ రొట్టెనే సమర్పించారు. తన ఆశయం రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం మాత్రమే అని జగన్ ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం. జగన్ రాకతో బారాషహీద్ దర్గా వద్ద ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారిని అదుపు చేయడం పోలీసులకు ఒక దశలో చాలా కష్టంగా మారింది.

వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఒక దీక్ష చేపట్టారు. హోదా రావడం అనే వ్యవహారాన్ని అనుమానాల్లో పడేస్తూ కేంద్రం మనకు ప్యాకేజీ కూడా ప్రకటించేసింది. అయితే , ఒకసారి దీక్ష చేసిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ హోదా సాధించడానికి తమ పార్టీ తరఫున ప్లాన్ చేస్తున్న తదుపరి కార్యాచరణ ఏమిటో ఇప్పటిదాకా ఇదమిత్థంగా తేల్చుకోలేదు. ఒక సారి దీక్ష ముగిసిన తర్వాత, ఏదో సందర్భం వచ్చినప్పుడు.. తెలుగుదేశం హోదా గురించి పట్టించుకోకుండా ద్రోహం చేసింది.. మేం ప్రత్యేక హోదా సాధించడానికి కట్టుబడి ఉన్నాం అనే మాటలు చెప్పడం మినహా నిర్దిష్టంగా వైకాపా ఉద్యమ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లడం గురించి చేసిన కృషి తక్కువ.

పవన్ కల్యాణ్ ఒక సభ పెట్టి ప్రత్యేకహోదా గురించి మాట్లాడి తర్వాత సైలెంట్ అయిపోయిన తీరుకు, జగన్ ఓ దీక్ష చేసిన తర్వాత సైలెంట్ అయిపోయిన తీరుకు ఏమీ తేడా లేదు. కాకపోతే.. జగన్ ఇలా రొట్టెల పండుగలాంటి సందర్భాల్లోను, ప్రెస్ మీట్ లలోను హోదా గురించి మాట్లాడుతున్నారు.

Similar News