సైకిలెక్కిన హస్తం : దేశమంతా ఆసక్తికరం!

Update: 2016-12-14 06:00 GMT

యూపీ ఎన్నికలను ఓ మోడల్ గా పరిగణించడానికి దేశంలోని అనేక రాష్ట్రాలు, మరియు అక్కడి ప్రాంతీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా యూపీలో తాజాగా కుదుదరుకుంటున్న పొత్తులు ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నాయనే దాని మీద.. దేశవ్యాప్తంగా ఉండే అన్ని ఎన్డీయేతర పార్టీల్లోనూ ఆసక్తి నెలకొంటోంది. ఈ ఫలితాలను బట్టే.. భవిష్యత్ లో తమ తమ రాష్ట్రాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు, రాజకీయ పునరేకీకరణలు జరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య కుదురుతున్న అనుబంధం.. లిట్మస్ టెస్ట్ లాంటిదని అందరూ ఎదురుచూస్తున్నారు.

యూపీలో కొన్ని నెలలుగా జరుగుతున్న పొత్తులు- రాజకీయ సమీకరణల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ- కాంగ్రెస్ ఇద్దరూ జతకట్టి.. భాజపాను ఎదుర్కోడానికి సిద్ధం అవుతున్నారు. విడివిడిగా పోటీచేయడం వల్ల కమలనాధులకు ఎడ్వాంటేజీ అవుతుందని భావించిన పార్టీలు ఈ మేరకు ఐక్యంగా పోరాడబోతున్నాయి. పొత్తులతో పోటీ చేయాలంటే.. కాంగ్రెస్ కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని ముఖ్యమంరతి అఖిలేష్ యాదవ్ ఇదివరకే ప్రకటించారు. అందుకు కాంగ్రెస్ కు పెద్దగా అభ్యంతరం ఉన్నట్లు కూడా లేదు. తమకు వేరే గత్యంతరం లేని రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో జతకట్టి, వారు ఎన్ని సీట్లు ధర్మం చేస్తే అంతవరకే పోటీచేసే సంస్కృతి కాంగ్రెస్ కు కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న తమిళనాడులో చేసిన పని కూడా అదే. అలాగే ఎస్పీ తో కూడా పొత్తు పెట్టుకోగలరు. సీట్ల పంపకం విషయంలో తొలుత పెద్ద డిమాండ్లే పెడతారు గానీ.. ఎన్ని ఇస్తే అన్ని తీసుకుని సర్దుకోగలరు.

భాజపాను కట్టడి చేయడం, మోదీ హవాకు అడ్డుకట్ట వేయడం ఒక్కటే అందరి లక్ష్యం గనుక.. సులువుగానే కాంబినేషన్లు కుదురుతున్నాయి. వీరిక్కడ సక్సెస్ సాధిస్తే.. దేశంలో ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీలు ఉన్న అనేక చోట్ల కాంగ్రెస్ వారి ప్రాపకం కోసం వెంపర్లాడుతుందేమో... అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాధించబోయే పరిణామం ఏమో చూడాలి.

Similar News