Chandrababu : ఈసారి నమ్ముతారా.. విశ్వాసమే ఈసారి అసలు సమస్యగా మారిందా?

ఎన్టీఏ కూటమి రేపు ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల చేయనుంది. అయితే ఈ మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది

Update: 2024-04-29 08:03 GMT

ఎన్టీఏ కూటమి రేపు ఎన్నికల మ్యానిఫేస్టో విడుదల చేయనుంది. అయితే ఈ మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందన్న దానిపై ఇప్పటికే చర్చోప చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ తన మ్యానిఫేస్టోను విడుదల చేసింది. అమలయ్యే హామీలను మాత్రమే తాము మ్యానిఫేస్టోలో చేర్చామని, గత ఎన్నికల మ్యానిఫేస్టోలో 99 శాతం అమలు చేశామని, ఈసారి కూడా వందకు వంద శాతం అమలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ పదే పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వెళుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా తనపై ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు పరివిధాలుగా శ్రమిస్తున్నారు. తనను నమ్మాలని ఆయన ప్రజలను కోరుతున్నారు.

మహిళను ఆకట్టుకునేందుకు...
ఈసారి మ్యానిఫేస్టోను పకడ్బందీగా అమలు చేస్తామని చెబుతున్నారు. చెప్పేవన్నీ చేస్తానంటూ ఆయన ప్రజల వద్దకు వెళుతున్నారు. చంద్రబాబు నాయుడు కూటమి ఏర్పడక ముందు సూపర్ సిక్స్ తో మ్యానిఫేస్టోను విడుదల చేశారు. అందులో అనేక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మహిళల ఓట్లు కీలకమని భావించిన చంద్రబాబు ఈసారి వారి ఓట్లును కొల్లగొట్టేందుకు మ్యానిఫేస్టోను రూపొందించారు. సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత ప్రయాణం మంచి ఫలితం ఇచ్చేదిగానే ఉంటుందంటున్నారు. దీనికి తోడు మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం కూడా మహిళలను ఆకట్టుకునేదే. ఈ రెండూ వైసీపీ మ్యానిఫేస్టోలో లేకపోవడం తనకు కలసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
యువత కోసం...
అలాగే చంద్రబాబు అంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని యువత భావిస్తారని టీడీపీ నేతలు పదే పదే చెబుతుంటారు. ఆయన వల్లనే కియా వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంటారు. అందుకే యువతకు ఈసారి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగం వచ్చేంతవరకూ ప్రతి ఒక్కరికి నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని కూడా చెల్లిస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. దీంతో పాటు రైతులకు, తల్లికి వందనం పేరిట కూడా పధకాలను ప్రకటించారు. అలాగే తాను అధికారంలోకి రాగానే పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచుతానని చంద్రబాబు ఇప్పటికే చెప్పేశారు. వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం చెల్లిస్తామని కూడా మాట ఇచ్చారు. ఇవన్నీ మహిళలు, యువత, రైతులను ఆకట్టుకునే విధంగా చంద్రబాబు తన సూపర్ సిక్స్ లో పొందుపర్చారు.
రేపటి మ్యానిఫేస్టోలో...
అయితే కూటమి తరుపున రేపు విడుదల చేయనున్న మ్యానిఫేస్టోలో మరిన్ని వరాలు ఉంటాయని చెబుతున్నారు. వైసీపీ మ్యానిఫేస్టోను మించి చంద్రబాబు రేపు ఉండవల్లి తన నివాసంలో ప్రకటించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు బీసీలకు సంబంధించిన విషయాలపై కూడా చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. వీటితో పాటు గతంలో తాము అమలు చేసిన పథకాలకు కొంత అదనపుమొత్తాన్ని జోడించి ఈ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నారు. అయితే ఈ మ్యానిఫేస్టో అయితే విడుదల అవుతుంది కానీ జనం దానిని ఎంత వరకూ నమ్ముతారన్నదే ఇప్పుడు ప్రశ్న. తనపై భరోసా ఉంచాలని, తాను చెప్పిన మాటను తప్పనంటూ చంద్రబాబు ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వస్తున్నారు. మరి బాబు మాటలను జనం నమ్ముతారా? లేదా? అన్నది మాత్రం ఫలితాల తర్వాత తెలియనుంది. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.


Tags:    

Similar News