దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు మరోసారి పెరిగాయి. నిజానికి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో మార్పు చేర్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడూ మారుతూ ఉండవలసిన పెట్రోలు డీజిలు ధరలను శనివారం నాడు మళ్లీ సవరిస్తూ ఉత్తర్వలు జారీ అయ్యాయి. లీటరు పెట్రోలుపై రూ.1.34, లీటరు డీజిలుపై రూ.2.37 పెంపు కొత్తగా విధించారు. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
అయితే మన దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు దాదాపుగా నిత్యావసరంగా మారిపోయిన తర్వాత.. వీటి విక్రయాల ముసుగులో ప్రభుత్వాలు సాధారణ పౌరులను ఎన్ని రకాలుగా దోచుకుంటున్నాయో అసలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో హెచ్చు తగ్గులకు అనుగుణంగా మన దేశంలో కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయన్నది ఓకే. కానీ.. మనదేశంలో ధరలు తగ్గినప్పుడు మాత్రం పైసల్లోనే ఎందుకు తగ్గుతాయో, పెరిగిన ప్రతిసారీ రూపాయల్లో ఎందుకు పెరుగుతాయో కూడా సాధారణ పౌరులకు అర్థంకాని పజిల్ లాగా మిగిలిపోతున్నది. పైగా .. ధరల పెంపులో కూడా వ్యత్యాసాల కారణంగా క్రమంగా పెట్రోలు, డీజిలు రెండూ దాదాపు ఒకటే ధరకు చేరుకునే లాగా కనిపిస్తోందని కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.