సాంకేతికతను ఇక్కడ అధ్యయనం చేయలేరా?

Update: 2016-11-08 13:46 GMT

యాదాద్రి అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కృతనిశ్చయంతో పనులు చేపడుతున్నారు. ప్రశస్తికి తగినట్లుగా.. యాదాద్రి క్షేత్రాన్ని తిరుమల గిరులతో సమానంగా జనాదరణ పొందేలా, వసతుల పరంగా, సిద్ధం చేయాలని ఆయన సంకల్పిస్తున్నారు. ప్రతిరోజూ లక్ష మంది భక్తులు వచ్చినా సరే.. వారికి వసతి, తదితర సదుపాయాలు అన్నీ ఉండేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారంటే.. ఇంచుమించుగా తిరుమలకు వచ్చే భక్తకోటి సంఖ్యకు అది సమానం. ఆశయం మంచిదే. భగవదనుగ్రహంతో అది నెరవేరాలనే కోరుకుందాం. అయితే యాదాద్రి క్షేత్రంలో అతిపెద్దదైన హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఇది కూడా మంచి ఆలోచన. కాకపోతే.. విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించడానికి ఓ బృందం చైనా వెళ్లి అక్కడ పరిశీలించి వస్తుందనే విషయమే చోద్యంగా ఉంది.

భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం విశేషం ఎంత మాత్రమూ కాదు. నిజానికి ఓ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదు నగరం నడిబొడ్డున ఏర్పాటు చేయడానికి కూడా కేసీఆర్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. మరొకవైపు ప్రపంచంలోనే అతిపెద్దదైన వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్ లో ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రభుత్వం అప్పుడే పనులు ప్రారంభించేసింది కూడా! పటేల్ విగ్రహం పూర్తయితే.. ప్రపంచంలోనే అది అతిపెద్దది అవుతుంది.

అలాంటి నేపథ్యంలో.. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్ర హం మన గుజరాత్ లో ఏర్పాటవుతున్నప్పుడు.. భారీ విగ్రహం ఏర్పాటు సాంకేతికత గురించి అధ్యయనం చేయడానికి బృందం చైనావెళ్లాల్సిన అవసరం ఏమిటి? అనేది సామాన్యులకు కలిగే సందేహం. ఒకవైపు మేకిన్ ఇండియా అని, మేకిన్ తెలంగాణ అని ప్రసంగాల్లో ఊదరగొడుతూ.. మన వద్ద జరుగుతున్న ప్రయత్నాన్ని కూడా మనం ఆమోదించలేకపోతే ఎలా అని సాధారణ ప్రజానీకానికి సందేహం కలుగుతుంది. అసలే.. ఇలాంటి అధ్యయనాల ముసుగులో నాయకులు, అధికారులు కలిసి ప్రభుత్వ సొమ్ము తగలేసి విదేశాలు తిరిగి వస్తారనే అపప్రధ ప్రజల్లో ఉంది. అది నిజం కాదని నిరూపించుకోవాలంటే.. అధికారులు చేసే సాంకేతిక అధ్యయనం ఏదో.. గుజరాత్ పటేల్ విగ్రహ ఏర్పాటు వద్దనే చేస్తే సరిపోతుంది కదా అని జనం అనుకుంటున్నారు మరి!!

Similar News