బ్లాక్ మనీ వ్యవహారం , తెలుగు రాష్ట్రం నుంచి పదివేల కోట్లు చెల్లించిన వ్యక్తి వ్యవహారం రెండు పార్టీల నడుమ విమర్శలకు వేదికగా మారిపోయింది. హైదరాబాదులో పారిశ్రామికవేత్త ఒకరు తన పదివేల కోట్ల రూపాయల నల్లధనాన్ని ప్రభుత్వానికి చూపించి తెల్లధనాం మార్చుకుంటే.. దాని మీద ఆంధ్రప్రదేశ్ లోని పాలక- ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా అదే పనిగా కొట్టేసుకుంటున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోజుకో నాయకుడు విలేకర్ల ముందుకు వచ్చి కేంద్రం రహస్యంగా తీసుకున్న వివరాలు చంద్రబాబుకు ఎలా తెలిసాయో చెప్పాలని, కేంద్రం నల్లకుబేరుల వివరాలు అన్నిటినీ వెల్లడించాలని డిమాండ్లు మొదలెట్టారు. జగన్ ప్రధాని మోదీకి నల్ల కుబేరుల వివరాలు అడుగుతూ రాసిన లేఖల గురించి ఘనంగా ప్రస్తావించుకుంటున్నారు. నల్ల కుబేరుల వివరాలు వెల్లడించాల్సిందిగా కోరుతూ, వాటిని బహిర్గతం చేయాల్సిందిగా ప్రధానిని కోరుతూ ఉత్తరం రాసిన మహా స్వచ్ఛమైన వ్యక్తి దేశంలో మరొకరు ఉన్నారా? అని వైకాపా నాయకులు పదేపదే జగన్ నిజాయితీని దానితో ముడిపెట్టి చెప్పుకుంటున్నారు.
అయితే తాజా పరిణామం ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే తెదేపా నేత కూడా గళమెత్తడం. ఈ అంశం మీద తమ పార్టీ విధానం భిన్నంగా ఉన్నదనే అంశంపై ఆయనకు అవగాహన ఉన్నదో లేదో గానీ.. అచ్చంగా జగన్ కోటరీ అడిగినట్లుగానే నల్లకుబేరుల పేర్లను కేంద్రం వెల్లడించాలంటూ తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నల్లకుబేరుల వివరాలను గోప్యంగా ఉంచుతామనే భరోసాతోనే ఈ ప్రకటన చేసిందని, తాము భాగస్వామిగా ఉన్న ప్రభుత్వాన్ని వారి నిర్ణయానికి వ్యతిరేకంగా , వైకాపా బాటలోనే పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేయడం ఇరుకున పెట్టడం అవుతుందని తెదేపా నాయకులకు ఓ శిక్షణ ఇస్తే బాగుంటుంది.