విశ్వవిజేత భారత్ : కబడ్డీలో అజేయం మన స్థానం!

Update: 2016-10-22 16:05 GMT

కబడ్డీలో తాము జగజ్జేతలం అని భారత్ మరో మారు సగర్వంగా నిరూపించుకుంది. 2016 ప్రపంచకప్ విజేతగా శనివారం రాత్రి భారత్ ఆవిర్భవించింది. ఇరాన్ తో జరిగిన ఫైనల్ మాయచ్ లో 39-26 పాయింట్ల తేడాతో భారత్ అపురూపమైన విజయాన్ని సాధించింది. కెప్టెన్ అనూప్ కుమార్ సారథ్యంలో.. అసమానమైన ప్రతిభను కనబరచిన భారత్.. ఫస్ట్ హాఫ్ లో ఒక సారి ఆల్ అవుట్ కూడా అయి పాయింట్ల రేసులో వెనుకబడినప్పటికీ.. సెకండ్ హాఫ్ లో అనూహ్యంగా కోలుకుని.. ప్రత్యర్థిని చావుదెబ్బ తీసింది. ఇప్పటికే ఏడుసార్లు వరుసగా ఏషియన్ గేమ్స్ బంగారు పతక విజేత అయిన భారత్.. ప్రపంచకప్ లో కూడా తనకు తిరుగులేదు అని చాటుకుంది. భారత్ తో ఆడడమే ఒక గౌరవం తప్ప.. భారత్ మీద గెలవడం కాదు అని ప్రత్యర్థి జట్లు బహిరంగంగా కామెంట్ చేసే స్థాయికి భారత్ పాటవం ప్రదర్శించిందంటే అతిశయోక్తి కాదు.

కొరియా మీద కష్టపడి గెలిచిన ఇరాన్, థాయిలాండ్ మీద సునాయాసంగా గెలిచిన భారత్ .. రెండు జట్లూ ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ లో ఆరంభంలో ఇరాన్ దూకుడుగా ఆడి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇరాన్ రైడర్ లను టాకిలింగ్ చేయడంలో.. భారత్ తడబాటు బరిలో స్పష్టంగా కనిపించింది. ఆ తడబాటును అసలే స్ట్రెంగ్త్ కు మారుపేరుగా చెప్పుకునే ఇరాన్ జట్టు బాగా వాడుకుంది. ఫస్ట్ హాఫ్ ముగిసేలోగా భారత్ ఒకసారి ఆల్ అవుట్ కూడా అయింది. తొలిహాఫ్ ముగిసేసరికి భారత్ రెండు పాయింట్లు వెనుకంజలో ఉంది.

అయితే సెకండాఫ్ లో బరిలోకి దిగిన తర్వాత.. ఇక భారత్ చెలరేగిపోయింది. అత్యద్భుతమైన టాకిలింగ్ లతో విరుచుకు పడింది. సెకండాఫ్ లోనే ఇరాన్ ను రెండు సార్లు ఆల్ అవుట్ చేసింది. మొత్తానికి విశ్వవిజేతగా ఆవిర్భవించింది.

Similar News