జ్యోతిష్యం వాస్తు విశ్వాసాలను విపరీతంగా అనుసరించే అలవాటు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తను కలగని నిర్మించుకున్న కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. తుది మెరుగులు దిద్దుకుంటోంది. ముహూర్తం కూడా ఖరారు అయింది. నవంబరు 26వ తేదీన కేసీఆర్ కొత్త క్యాంప్ ఆఫీసులోకి గృహప్రవేశం చేయబోతున్నారు.
కేసీఆర్ ప్రస్తుతం ఉన్న క్యాంప్ ఆఫీసును గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నిర్మించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆ క్యాంప్ ఆఫీసులో ఆయన వాస్తు దోషాలు ఉన్నాయని భావించారు. అలాగే.. సెక్రటేరియేట్ లో సీఎం కార్యాలయం కూడా ఆయనకు దోషంగానే కనిపించింది. సెక్రటేరియేట్ లోని సీఎం కార్యాలయాన్ని కేసీఆర్ చాలా పరిమితంగా మాత్రమే వాడారు.
అసలు ఆయన సెక్రటేరియేట్ కు వెళ్లనే వెళ్లరనే అపకీర్తి కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. అవేమీ ఖాతరు చేయకుండా.. కేవలం క్యాంప్ ఆఫీసునుంచే ఆయన దాదాపుగా పాలన సాగించారు. అలాంటిది.. క్యాంప్ ఆఫీసు కూడా తనకు తగిన వాస్తు గుణాలతో సరికొత్త భవనాన్ని నిర్మించడానికి ఆయన ఇటీవలే సంకల్పించారు. శరవేగంతో దాని నిర్మాణం పూర్తయింది.
నవంబరు 26వ తేదీన సీఎం తన కొత్త క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లబోతున్నారు. మొత్తం 38 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. అయితే.. కేసీఆర్ కొత్త భవనంలోకి వెళ్లిన తర్వాత.. ప్రస్తుతం ఉన్న క్యాంప్ ఆఫీసును ఏ అవసరాలకు వినియోగిస్తారు, ఎవరికి కేటాయిస్తారు అనేది ఒక కీలక చర్చనీయాంశంగా ఉంది.