వార్ధా ప్రభావిత జిల్లాల్లో ఏపీ సర్కార్ రెడ్ ఎలర్ట్

Update: 2016-12-10 18:27 GMT

వార్ధా సహా భవిష్యత్‌లో వచ్చే అన్ని తుఫాన్లను ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను వస్తుందన్న సమాచారం అందుకున్న క్షణం నుంచే ముందస్తు చర్యలు తీసుకునేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థ సంసిద్ధం కావాల్సి వుందన్నారు. దేశంలో మరే రాష్ట్రానికి లేనట్టుగా ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పుడూ తుఫాన్ల ముప్పు వుంటుందని, అందుకనుగుణంగా అధికార యంత్రాంగం శాశ్వత చర్యలు తీసుకోవాల్సి వుందని చెప్పారు. తుఫాన్ల సమయంలో పక్కరాష్ట్రాలపై ఆధారపడకుండా సహాయక చర్యలు చేపట్టగలగాలని అన్నారు.

వార్ధా తుఫానుపై శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్ధా తుఫాన్‌ను ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పంటలు నష్టపోకుండా రైతులను, సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులను అప్రమత్తం చేయాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణకు, రహదారులపై చెట్లు కూలితే తొలగింపునకు యంత్రాంగం సిద్ధంగా వుండాలన్నారు. వాగులలో పూడికను యుద్ధప్రాతిపదికన తొలిగించాలని సూచించారు. వార్ధా తుఫానుతో వచ్చే వానలను ఒడిసి పట్టాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి పంటకుంటలు నిండేలా, కనీసం మూడు మీటర్ల లోపలికే భూగర్భజలాలు పెరిగేలా ఎక్కడికక్కడ వాననీటిని ఇంకిపోయేలా చేయాలని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా చూడాలన్నారు.

వార్ధా కారణంగా 11వ తేదీ సాయంత్రం తర్వాత రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ముఖ్యమంత్రికి వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 12న నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లోని పలుచోట్ల అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలు, రాష్ట్రంలో మిగిలిన అన్నిచోట్ల మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. 12వ తేదీ రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య శ్రీహరికోటకు దగ్గరలో వార్ధా తుఫాన్ తీరం దాటే అవకాశం వుందన్నారు. తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కి.మీ. వేగంతో గాలులతో పాటు, అత్యధికంగా 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదుకానుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 5 కి.మీ. పరిధిలో వున్న మొత్తం 1,876 రెయిన్‌గేజ్‌లను ప్రాతిపదికగా చేసుకుని వర్షపాతం వివరాలను నమోదు చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటివరకు తవ్విన 1,77,351 పంటకుంటలలో ప్రస్తుతం వున్న నీటినిల్వల వివరాలు, తుఫాన్ అనంతరం నమోదయ్యే నీటిమట్టం సమాచారాన్ని విశ్లేషించుకునేలా డేటా రూపొందించాలని చెప్పారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా వుండే జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వుండాలని ఆదేశించారు.

Similar News