వారు ఫీట్లు చేస్తున్నారు.. ఆయన ట్వీట్లు చేస్తున్నారు!

Update: 2016-12-09 01:47 GMT

కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థి మనల్ని తిట్టినా కొట్టినా కూడా హాయిగా ఉంటుంది. కానీ, మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భరించలేం అనిపిస్తుంది. ఇప్పుడు నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిందే, నిర్ణయం వెనక్కు తీసుకోవాల్సిందే.. పునరాలోచన చేయాల్సిందే అంటూ నానా యాగీ చేస్తున్న, పార్లమెంటు ఉభయ సభలను అనునిత్యం స్తంభింపజేస్తున్న విపక్షాల పరిస్థితి అచ్చంగా అలాగే ఉంది. వారేమో.. పార్లమెంటులో ప్రధానిని మా సందేహాలకు సమాధానం చెప్పమనండి.. అంటూ డిమాండ్ చేస్తారు. మోదీ అదే సభలో ఉంటారు గానీ.. వారి డిమాండ్ అంటే తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తారు. ఈ మోదీ వ్యవహార సరళి ప్రతిపక్షాల వారికి పుండు మీద కారం రాసినట్లుగా ఉంటోంది. వారు సభను స్తంభింపజేయడంలో మరింత రెచ్చిపోతున్నారు.

ఒకవైపు అద్వానీ లాంటి పెద్దలు, మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్ వంటి సీనియర్లు కూడా సభను స్తంభింపజేస్తున్న తీరును గర్హిస్తుండడంతో విపక్షాల తీరులో మార్పు వచ్చే అవకాశం ఉంది.

అయితే ప్రధాని మోదీ మాత్రం విపక్షాలు కోరుతున్నట్లుగా సభలో స్పందించడం అసలే జరగడం లేదు. సభాముఖంగా ఆయన సమాధానం రాబట్టడానికి వారంతా రకరకాల ఫీట్లు చేస్తున్నారు.. అక్కడ పట్టించుకోని మోదీ తన స్పందనను మాత్రం వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

గురువారం నాడు కూడా మోదీ వరుస ట్వీట్లతో నోట్ల రద్దు అనంతర కష్టాల గురించి ప్రస్తావించారు. పెద్దనోట్ల రద్దు వల్ల కొంత కష్టాలుంటాయని తాను తొలినుంచి చెబుతున్నానని, స్వల్పాకలిక నష్టాలను భరిస్తే దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని మోదీ ట్వీట్లు చేశారు. నగదు రహిత లావాదేవీల దిశగా దేశాన్ని మళ్లించడానికి ఇప్పుడొక చారిత్రాత్మక అవకాశం లభిచిందని మోదీ అంటున్నారు. ఈ ప్రయత్నం ఒక యజ్ఞమనీ, కష్టాలు పడుతున్న వారికంతా తాను శాల్యూట్ చేస్తున్నానని మోదీ పేర్కొన్నారు. ట్వీట్లలోనే చాలా విపులంగా తన అభిప్రాయాలు వెల్లడించారు.

చూసిన వారు మాత్రం.. ఆయన మాటలు రాబట్టడానికి విపక్షాలు సభలో ఫీట్లు చేస్తోంటే.. ఆయన ఎంచక్కా ట్వీట్లు చేస్తున్నారంటూ నవ్వుకుంటున్నారు.

Similar News