భారతీయ క్రికెట్ క్రీడాభిమానులకు డబుల్ బొనాంజా ఇవ్వడానికి ఇండియన్ క్రికెట్ జట్టు సన్నద్దం అవుతోంది. కొహ్లి నేతృత్వంలో టెస్టు జట్టు ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన నేపథ్యంలో, ధోనీ నేతృత్వంలో వన్డే జట్టు కూడా ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని అభిమానులకు కానుకగా ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కీలకమైన న్యూజీలాండ్‌తో వన్డే సిరీస్ చాలా కీలకం అయిన నేపథ్యంలో... తొలి వన్డేలో తిరుగులేని విజయంతో భారత జట్టు తమ అసలు టార్గెట్ ఏమిటో ప్రత్యర్థికి స్పష్టం చేసింది.
భారత జట్టు ప్రస్తుతం టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ లోనే ఉంది. వన్డే జట్టు కూడా నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకోవాలంటే.. న్యూజీల్యాండ్ తో ప్రస్తుతం మనం ఆడుతున్న 5 వన్డేల సిరీస్ ను 4-1 తేడాతో చేజిక్కించుకోవాలి. సో, భారత లక్ష్యం ఏదో సిరీస్ విజయం మాత్రమే కాదని, దాదాపుగా వైట్ వాష్ చేసి, ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి వెళ్లడం అని తెలుస్తోంది.
ధర్మశాల లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడిన కివీస్ 43.5 ఓవర్లకే 190 పరుగులు చేసి కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్లను కోల్పోయిన తరవాత.. క్రీజులోకి వచ్చిన కొహ్లి కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ చుక్కలు చూపించాడు. మొత్తంగా 85 పరుగులు చేసిన కొహ్లి సెంచరీ కొట్టే ఊపు మీద ఉన్నట్లుగానే కనిపించాడు గానీ.. పాపం ఈలోగా టార్గెట్ రీచ్ కావడం జరిగిపోయింది.
న్యూజీలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లాథమ్ అజేయంగా చేసిన 79 పరుగులు, బౌలర్ సౌతీ 55 పరుగులతో జట్టును కాపాడేందుకు చేసిన ప్రయత్నం అన్నీ వృథా అయ్యాయియ. భారత బౌలర్లలో మిశ్రా 3, పాండ్యా 3, యాదవ్, జాదవ్ లు చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు.
5 వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 తో ముందడుగు వేసింది. ఈ ప్రస్థానం 4-1 వరకు వెళ్లిందంటే ప్రపంచ వన్డే నెంబర్ వన్ ర్యాంకింగ్ మన సొంతం అవుతుంది.