మందుకొట్టే వారికి శనివారం పండగదినం. ఆదివారం సెలవు గనుక.. ఎంచక్కా పనులకు వెళ్లాల్సిన అవసరం లేదు గనుక.. శనివారం రాత్రి హాయిగా మందు కొడితే.. ఆదివారం పొద్దంతా ఆ మత్తులో గడచిపోయినా పరవాలేదని ఎదురుచూస్తుంటారు. మందుకొట్టడానికి సెలవు రోజులకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సెలవులైతే మందుకొట్టడం పెరుగుతుంది. అదే సెలవులు వరుసగా పదిరోజుల పాటూ వస్తే ఇంకేమైనా ఉందా? అందుకే ఆ లెక్కలు తీసే సరికి గుండెలు అవిసిపోయే గణాంకాలు వెల్లడవుతున్నాయి. ఒక చిన్న ప్రాజెక్టు నిర్మించగలిగే స్థాయిలో తెలంగాణలో ప్రజలు దసరా సెలవుల్లో ప్రజలు మద్యం తాగేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ గణాంకాల ప్రకారం తెలంగాణలో దసరాసెలవుల్లో మొత్తం 585 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటూ మొత్తం 300 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. 10వ తేదీ ఒక్కరోజే 113 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి.
ఇవన్నీ అధికారికంగా వెల్లడించిన అమ్మకాల గణాంకాలు. జనంలో పండగ సందర్భంగా డిమాండ్ ఎక్కువగా ఉన్నది గనుక.. లిక్కర్ షాపుల్లో ఎమ్మార్పీ కంటె ఎక్కువ ధర కు అమ్మడం సహజంగా జరిగేదే. అలా అక్రమంగా జనం నుంచి దోచేసిన మొత్తం ఎన్ని వందల కోట్లు ఉన్నదో లెక్క తెలీదు. అలాగే బెల్ట్ షాపుల్లో ఎమ్మార్పీ మీద ఎక్కువ పెట్టి అమ్మే మొత్తాల రూపేణా ఎన్ని వందలకోట్లు అక్రమార్కుల పరం అయిందో తెలియదు.
కేవలం దసరా పర్వదినాల్లోనే 585 కోట్ల రూపాయల మద్యం తాగేశారంటే ఎవరైనా షాక్ తింటారు. అదే సమయంలో ఇదే నెలలో దీపావళి పర్వదినం రాబోతోంది. దీపావళి బాణసంచా పేరిట జనం ఎన్ని వందల కోట్ల రూపాయలను తగలేస్తారో చూడాలి.