రేవంత్ ధిక్కారం : ‘మీ ఇష్టం’ అన్న చంద్రబాబు!

Update: 2016-10-22 10:01 GMT

తెలంగాణ సర్కారుతో స్నేహపూర్వకంగా ఉంటూనే పనులు సాధించుకోవాలి.. ఇరు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలి అనే నినాదం చంద్రబాబునాయుడుకు కొన్ని వేదికల మీద మాట్లాడేప్పుడు బాగానే ఉపయోగపడవచ్చు. అదే సమయంలో తెలంగాణలోని పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నప్పుడు ఆయనకు అది ఎలా ఉపకరిస్తుంది? చాలా కష్టం. ఇప్పుడు అదే జరుగుతోంది. పాలిట్ బ్యూరో సమావేశంలో ఇరు రాష్ట్రాల పార్టీ నాయకులతో చంద్రబాబునాయుడు సమావేశం అయినప్పుడు ఒక దశంలో తెలంగాణ సర్కారు పట్ల ఆయన ప్రదర్శిస్తున్న మెతక వైఖరితో.. తెతెదేపా నాయకులు విబేదించినట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించగా, చంద్రబాబు ముక్తసరిగా మీ ఇష్టం అంటూ విషయాన్ని పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది.

చంద్రబాబునాయుడు తెలంగాణ సర్కారు మీద దూకుడు ప్రదర్శించే స్థితిలో లేరు. అలాగని తెలంగాణ లో పార్టీని భూస్థాపితం చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదు. తెలంగాణలో పార్టీకి అంతో ఇంతో ఇమేజి తీసుకురావడం లక్ష్యంగా చంద్రబాబు తాజాగా కొత్త నినాదాన్ని పాలిట్ బ్యూరో లో తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేలా తమ పార్టీ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని, దాన్ని గనుక సాధిస్తే ప్రజలు తమను ఆదరిస్తారని ఆయన నమ్ముతున్నారు. ఇప్పటికే తెరాస కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి తీవ్రస్థాయిలోనే పోరాడుతోంది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా అంటున్నారు. ఇద్దరి డిమాండ్లూ కలిపి, కేంద్రం కాళేశ్వరానికరి హోదా ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

అదే సమయంలో హైదరాబాదులో ఇన్నాళ్లూ ఏపీ సర్కారు వాడుకున్న సచివాలయాన్ని ఇక తెలంగాణకు ఇచ్చేద్దాం.. వారు కూల్చేయాలని అనుకుంటున్నారు అనే సంగతిని చంద్రబాబునాయుడు ప్రతిపాదించినప్పుడు.. రేవంత్ రెడ్డి అడ్డం పడ్డారుట. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అన్ని బ్లాకులను కూల్చేసి.. సరికొత్త సచివాలయం నిర్మించడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రేవంత్ మాట్లాడుతూ.. డి-బ్లాక్ కొత్తదే గనుక.. దాన్ని కూల్చాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా తాము పోరాడాలని అనుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పారుట. అంటే నిజానికి అది చంద్రబాబుకు ఇష్టం లేని పోరాటం. అయితే చంద్రబాబు ఆ విషయంలో బయటపడకుండా.. ‘స్థానిక పరిస్థితులను బట్టి ఆ విషయంలో ముందుకు వెళ్లాలని’ చెప్పి విషయం దాటవేసినట్లుగా చెబుతున్నారు.

అయినా కొత్త సచివాలయాన్ని బృహత్ రూపంలో నిర్మించదలచుకున్నప్పుడు.. ఒక బ్లాక్ ను మాత్రం ఉంచడం అనేది ఏ రకంగానూ సరైన నిర్ణయం కాదు. అయితే చంద్రబాబు సూటిగా రేవంత్ తో తన అభ్యంతరాలు చెప్పకుండా దాటవేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Similar News