రెండు రాష్ట్రాల రైతులను కాపాడండి

Update: 2017-01-06 07:06 GMT

ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మెన్ ను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరుతుండగా కాసేపు ఆగి ప్రకాశం బ్యారేజీని ముఖ్యమంత్రి పరిశీలించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కృష్ణా నదికి సంబంధించిన జలాల స్థితిగతులపై సమీక్షించడానికి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మన్ హెచ్.కె.హల్ధర్, కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ సమీర్ ఛటర్జీ ఏపీకి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కృష్ణా నదీ జలాల పంపిణీ జరిగేలా చూడాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మన్ హెచ్.కె.హల్ధర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

నీటి కొరత ఎక్కువగా ఉన్నప్పుడు ఎగువరాష్ట్రాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ....ఈ సంక్షోభం నుంచి తమ రాష్ట్రాన్ని గట్టెక్కించాలని బోర్డు ఛైర్మన్ కు సీఎం సూచించారు. అంతర్ రాష్ట్ర నది జలాల వివాదాలు తరచూ కేంద్రానికి తల నొప్పులు సృష్టిస్తుండటంతో సమస్య పరిష్కారం కోసం రివర్ మేనేజ్ మెంట్ బోర్డు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వేసవిలో రెండు తెలుగు రాష్ట్రాలు నీటి ఎద్దడిని ఎదుర్కో నున్నాయి. గత ఏడాది రెండు రాష్ట్రాలు పోటీ పడి నీటిని వాడేయడంతో ఈ దఫా బోర్డు స్వయంగా అందుబాటులో ఉన్న జలాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Similar News