మనదేశంలో ప్రస్తుతం కబడ్డీ ప్రపంచకప్ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆరు ఖండాలనుంచి 12 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. మ్యాచ్ లన్నీ కూడా గుజరాత్ అహ్మదాబాద్ లోనే జరుగుతున్నాయి.
శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లలో అర్జంటీనా జట్టుమీద అత్యద్బుతమైన విజయాన్ని నమోదు చేయడం ద్వారా భారత్ సెమీస్ లోకి ఘనంగా ఎంటర్ అయింది. గ్రూప్ ఏ లో భారత్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో కూడా అగ్రభాగంలోనే ఉంది. ఆ నేపథ్యంలో శనివారం రాత్రి గ్రూపులో చిట్టచివరి స్థానంలో ఉన్న అర్జంటీనాతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజృంభించి ఆడింది. అత్యద్బుతమైన రైడ్ లు, పసికూనల్లాంటి అర్జంటీనా జట్టు ఆటగాళ్లు రెయిడ్ కు వచ్చినప్పుడు అత్యద్భుతమైన టాకిల్ లు చేపడుతూ.. భారత్ చెలరేగిపోయింది. మన ఆటగాళ్లు ఏకంగా 74 పాయింట్లు స్కోర్ చేశారు. అది మాత్రమే కాదు... ప్రత్యర్థి జట్టు 21 కంటె ఎక్కువ పాయింట్లు స్కోర్ చేయలేకుండా కూడా కట్టడి చేయగలిగారు. దీంతో ఇప్పటిదాకా ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలోనే ఏ జట్టూ కూడా సాధించనంత రికార్డు విజయం భారత్ సొంతమైంది. అత్యధికంగా 53 పాయింట్ల వ్యత్యాసంతో విజయంసాధించి భారత్ రికార్డు బద్దలు చేసింది.
శనివారం నాడే జరిగిన మరో మ్యాచ్ లో ఇరాన్ కూడా విజయం సాధించింది. కొరియా కూడా ఆస్ట్రేలియా పై అపురూప విజయం నమోదు చేసి సెమీస్ లో తన బెర్తు ఖరారు చేసుకుంది. సెమీస్ దశకు వచ్చిన తర్వాత ఈ కబడ్డీ మ్యాచ్ లు మరింత రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.