రాజకీయ వ్యూహం  : రివర్స్ గేర్ లో ‘మన్ కీ బాత్’

Update: 2016-11-13 04:29 GMT

‘మన్ కీ బాత్’ అంటే ఈ దేశ ప్రజలకు ఇప్పటిదాకా తెలిసింది ఒక్కటే. ప్రధాని నరేంద్రమోదీ ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాన్ని లైవ్ లో రేడియో ద్వారాను, తర్వాత టీవీల ద్వారాను, పత్రికల ద్వారాను దేశ ప్రజలందరికీ ఆయన ఆలోచనలు, దేశం కోసం ఆయన చెప్పదలచుకున్న విషయాలు తెలిసేలా ప్రచారం నిర్వహిస్తారు. ప్రజలకు తెలిసిన మన్ కీ బాత్ అదే. ప్రధాని తాను చెప్పదలచుకున్నది చెప్పేయడమే మన్ కీ బాత్.

కానీ... ఇదే ‘మన్ కీ బాత్’ అనే నినాదాన్ని ఒక రాజకీయ వ్యూహంగా వాడుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహంగా అనుసరించబోతున్నది. యూపీలో మన్ కీ బాత్ ను రివర్స్ గేర్ లో అమలు చేయబోతున్నారు. అంటే ప్రధాని తాను చెప్పదలచుకున్నది చెప్పడం కాదు.. ప్రజలు చెప్పదలచుకున్నది విని రికార్డు చేసుకోవడం అన్నమాట. యూపీ రాష్ట్ర మంతటా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ’మన్ కీ బాత్‘ కార్యక్రమం కింద ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాయని, వారి కష్టాలు తెలుసుకుంటాయని, వాటన్నిటినీ క్రోడీకరించి.. పార్టీ మేనిఫెస్టోను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేస్తాం అని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెలవిస్తున్నారు.

పార్టీ మేనిఫెస్టో రూపకల్పననే మన్ కీ బాత్ అనే కార్యక్రమంగా మార్చేస్తున్నారన్నమాట. యూపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ప్రభుత్వంలోకి వచ్చి.. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో తమ ఉనికి కాపాడుకోవాలని ఆరాటపడుతున్న భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయాలు, కష్టాలు, అభిలాషల గురించి ఎన్నికలకు ముందస్తుగా బృహత్ సర్వేను నిర్వహించి.. వాటినుంచి మేనిఫెస్టోను తయారుచేయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. మరి రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలనుంచి వేర్వేరు సమస్యలు తమ దృష్టికి వస్తే ఆమ్‌ఆద్మీ పార్టీలాగా నియోజకవర్గాలకు విడివిడిగా మేనిఫెస్టో తెస్తారో లేదా.. రాష్ట్రానికి ఒకటే మేనిఫెస్టో తెస్తారో.. ’మన్ కీబాత్‘ అంటూ ప్రజల మనసులోని మాటను తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఎంత సమర్థంగా వాడుకుంటారో చూడాలి.

Similar News