రద్దుచేసిన వెయ్యి, ఐదొందల రూపాయల నోట్లు ఇంకా గుట్టగుట్టలుగా బయటపడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ శివారు ఉప్పల్ పీఎస్ పరిధి ప్రశాంత్ నగర్ లో నిషేధిత పాత కరెన్సీ మార్పిడి ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. ముఠా సభ్యులైన అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరొక నిందితుడు పరారయ్యాడు. మల్కాజిగిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ ఉప్పల్ పీఎస్ లో నిందితులను మీడియా ముందు హజరుపరిచారు. వివరాల్లోకి వెళితే ... హైదరాబాద్ మలక్ పేట కు చెందిన మహమ్మద్ కరీమ్ , మెహిదీపట్నం కు చెందిన ఇంతియాజ్ లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూంటారు. తమకు తెలిసిన మిత్రులు , బంధువులు ,రియల్ మార్కెట్ లోని తోటి వ్యాపారస్థుల వద్ద ఉండిపోయిన నిషేధిత పాత కరెన్సీని ఇరవై శాతం కమీషన్ తో కొత్త నోట్లు మారుస్తామని భారతీయ పాత నిషేధిత కరెన్సీని సేకరించారు. విశ్వసనీయ సమాచారం లభించడంతో రాచకొండ ఎస్ వోటీ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.అందులో భాగంగా ఉప్పల్ పీఎస్ పరిధి ప్రశాంత్ నగర్ లో తన సన్నిహితులైన తిరుపతి , రిజ్వాన్ , సిద్దిఖీ , నజీర్ లతో కలిసి మహమ్మద్ కరీమ్ ఒక యాక్సెంట్ కారులో వేచి ఉండగా రాచకొండ ఎస్ వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదనంతర విచారణ నిమిత్తం ఉప్పల్ పీఎస్ కు తరలించి , వారినుంచి తొంభై తొమ్మిది లక్షల బ్యాన్ అయిన ఇండియన్ కరెన్సీ , ఒక హోండా యాక్సెంట్ కారు , ఏడు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని నిందితులను రిమాండ్ కి తరలించారు. కాగా ముఠా కీలక సభ్యుడు ఇంతియాజ్ పరారీలో ఉండడం గమనార్హం.