యోగా అంటే ఠారెత్తిపోతున్నారు!

Update: 2016-10-05 22:42 GMT

చంద్రబాబునాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరికీ మూడురోజుల శిక్షణ సమావేశాలు ఏర్పాటుచేశారు. ఈ శిక్షణ సమావేశాలు ఏదో తరగతి వేళల్లా మాత్రమే జరిగేవి కాదు. పొద్దస్తమానమూ చంద్రబాబు నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం జీవించడమే. ప్రతినిధులకు వసతి కూడా యూనివర్సిటీలోనే కావడంతో.. వారు తప్పించుకోడానికి కూడా చాన్సు లేదు. పొద్దున లేవగానే యోగా క్లాస్‌ అంటూ పురమాయింపు వచ్చేస్తోంది.

అయితే ఎమ్మెల్యేలకు ఇతర శిక్షణలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ యోగాసనాలు వేయాల్సి వచ్చేసరికి మెజారిటీ సభ్యులు బెంబేలెత్తిపోతున్నారట. నిజానికి బుధవారం నాడు యోగ తరగతులకు చాలా తక్కువ సంఖ్యలోనే సభ్యులు హాజరు కావడం విశేషం. అలాగే.. రెండోరోజు శిక్షణ మొత్తం టెక్నాలజీ బేస్డ్‌ గా జరగడంతో చాలామంది ఎమ్మెల్యేలకు అదంతా లాటిన్‌ భాష లాగా అనిపించిందంటే అతిశయోక్తి కాదు.

ఈ టెక్నాలజీ సంగతులన్నీ మాకంటె మా పీయ్యేలకు శిక్షణ ఇస్తే మంచిది. మేం నేర్చుకున్నా సరే.. మా పనులు చేసేది పీయేలే కదా.. అంటూ కొందరు విసుక్కోవడమూ కనిపించింది. మొత్తానికి ఎమ్మెల్యేల్లో టెక్నాలజీ మీద గానీ, చంద్రబాబు చేసిన ఆలోచనల మీద గానీ ఓ అవగాహన వస్తుందని అనుకుంటున్నారు.

అయినా చంద్రబాబు తాను తయారుచేసిన మూసలోనే అందరూ ఒదిగిపోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ తన పార్టీలో ఉండేది ఎంతటి విధేయులు అయినప్పటికీ.. మరీ అంత పచ్చిగా వ్యవహారం ఎందుకుంటుంది? నాయకులు ఒక్కొక్కరు ఒక్కక్క రీతిగా ఉంటారనేది శిక్షణ తరగతుల్లోనే తేలుతోంది.

Similar News