యాంకర్ ఆత్మహత్య ఎందుకంటే?

Update: 2018-04-02 02:50 GMT

నా మెదడే నా శత్రువు. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది ఓ టీవీ ఛానల్ యాంకర్. హైదరాబాద్ మూసాపేట్ లో జరిగింది ఈ ఘటన. రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఈమె పేరు రాధికారెడ్డి. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని ఓ టీవీ ఛానల్లో న్యూస్ యాంకర్ గా ఉద్యోగం చేస్తోంది. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని శ్రీవిల్లా అపార్ట్ మెంట్లోని 204 ప్లాట్ లో తన తండ్రి, చెల్లితో కలిసి నివాసముంటోంది. పదిహేనేళ్ల క్రితం అనీల్ కుమార్ రెడ్డితో వివాహమైంది. వీరికి పద్నాలుగేళ్ల కుమారుడు భానుతేజారెడ్డి ఉన్నాడు. కుమారుడు మానసిక వికలాంగుడు. ఆరు నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది రాధిక. అప్పటి నుంచి రాధిక మానసికంగా కుంగిపోతున్నట్టు తెలుస్తోంది. రాత్రి ఆఫీస్ లో విధులు ముగించుకుని ఇంటికొచ్చిన రాధిక నేరుగా ఐదో అంతస్తు దాటుకుని.. టెర్రస్ పైకి చేరుకుని అక్కడి నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. అపార్ట్ మెంట్ ముందు వైపు పెద్ద శబ్దం రావడంతో.. అటు వైపు చూసిన వాచ్ మెన్ కంగుతిని అందరినీ పిలిచారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మానసికంగా కుంగిపోయి....

కట్టుకున్న భర్త విడాకులతో దూరమవడం..కన్నకొడుకు మానసిక వికలాంగుడు కావడంతో రాధికను బాగా కుంగదీసింది. తన జీవితంలో సంతోషం లేకపోవడం ఆమెని డిప్రెషన్ కు గురిచేసినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా తీవ్ర నిర్వేదంలో ఉన్న రాధిక జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకుంది. అక్కడ లభించిన సూసైడ్ నోట్ లో డిప్రెషన్ వల్ల చనిపోతున్నా.. నా మెదడే నా శత్రువు, నా చావుకు ఎవరూ కారణం కాదంటూ రాసి ఉన్న పేపర్ లభించింది. ఆత్మహత్యకు పాల్పడిన రాధిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీమార్చురీకి తరలించారు పోలీసులు. రాధిక ఆత్మహత్యకు మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉందని చెప్తున్నారు పోలీసులు.

Similar News