మెగాస్టార్ ఇంటివద్ద అర్ధరాత్రి మహిళ హల్‌చల్...!

Update: 2017-12-10 05:11 GMT

తనకు చిరంజీవి బాగా తెలుసని.. ఒక్కసారి నా పేరు చెబితే బయటకు వస్తాడంటూ సెక్యూరిటీ సిబ్బందిని దబాయించింది. జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన శ్రీదేవి (40) అనే మహిళ అర్ధరాత్రి ఒకటిన్నర ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నెం .26 లోని చిరంజీవి నివాసం వద్దకు చేరుకుంది. చాలాసేపు ఇంటి ముందు కూర్చున్న శ్రీదేవిని సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించగా... తాను చిరంజీవి కోసం వచ్చానని, వెంటనే కలవాలని చెప్పింది. అయితే చిరంజీవిని కలవడానికి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని, ఉదయం పూట వచ్చి ప్రయత్నించాలని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. చిరంజీవి తనను చూస్తే బయటకు వచ్చి పలకరిస్తారని, ఒక్కసారి చూపించండని... చూపించే వరకు ఇక్కడే కూర్చుంటానని భీష్మించుకుంది. దాంతో ఈ విషయాన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు శ్రీదేవిని పీఎస్‌కు తీసుకువెళ్లారు. ఎట్టి పరిస్థితిలో చిరంజీవిని కలిసిన తర్వాతే ఇంటికి వెళ్తానంటూ పట్టుపట్టడంతో అక్కడే కూర్చోబెట్టారు. తర్వాత శ్రీదేవి బంధువులు రావడంతో అమెను పంపించేశారు.

Similar News