మాటలు మాని.. నిర్మాణాత్మక పోరాటానికి దిగాలి

Update: 2016-11-12 06:09 GMT

తెలంగాణలో కేసీఆర్ సర్కారు మీద విపక్షాలు ఏచిన్న అవకాశం దొరికినా విరుచుకుపడుతూనే ఉన్నాయి. రైతు అంశాలు, విద్యార్థి అంశాల మీద ధర్నాలు, సభలు నిర్వహిస్తూ పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పడానికి ఎలాంటి అవకాశం ఉన్నా విపక్షాలు వదలుకోవడం లేదు. తెలుగుదేశంపార్టీ తరఫున తెంగాణలో కేసీఆర్ సర్కారును ఇరుకున పెట్టగల ఏ సందర్భాన్నీ వదులుకోకుండా పోరాడుతున్నది వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డే అని చెప్పాలి. తాజాగా ఆయన భద్రాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన భద్రాద్రి విద్యుదుత్పత్తి కేంద్రం విషయంలో తన నిరసన గళం వినిపిస్తున్నారు.

ఈ విద్యుదుత్పత్తి కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే.. ఈ కేంద్రం స్థాపన అనేదే చీకటి ఒప్పందంగా జరిగిందనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. 1080 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేస్తోంది. అయితే దీనికి సంబందించిన ఒప్పందాలు అన్నీ ఒక అవినీతి పుట్ట అని రేవంత్ రెడ్డి అభివర్ణిస్తున్నారు. ఈ కేంద్రానికి కాలుష్యనియంత్రణ మండలి నుంచి నిబంధనల ప్రకారం అనుమతులు వచ్చే అవకాశమూ లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. సూపర్ సబ్ క్రిటికల్ సామర్థ్యం ఉన్న వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కేవలం సబ్ క్రిటికల్ సామర్థ్యం గల దీనికి శంకుస్థాపన చేశారని.. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుండడం నిజమే అయితే గనుక.. బాధ్యతగల విపక్షంగా రేవంత్ రెడ్డి కేవలం మాటల విమర్శలకు పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఈ అంశం మీద నిర్మాణాత్మక పోరాటం చేయడానికి ఆయనకు అవకాశం ఉంది. గట్టిగా న్యాయపోరాటం చేయడానికి అవకాశం ఉంది. న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వాలు నియమవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో స్విస్ ఛాలెంజ్ విషయంలో ఏపీ సర్కారు, సచివాలయ కూల్చివేత విషయంలో తెలంగాణ సర్కారు రుచిచూస్తూనే ఉన్నాయి. తాను చెబుతున్నట్లుగా విద్యుత్తుకేంద్రం నిబంధనలకు విరుద్ధంగా ఉంటే గనుక.. ఆయన న్యాయపోరాటం చేస్తే ఆయనకే కాదు పార్టీకి కూడా మన్నన దక్కుతుందని పలువురు భావిస్తున్నారు.

Similar News