మనోళ్లు తొలిదెబ్బ బాగానే కొట్టారు!

Update: 2016-10-02 06:20 GMT

న్యూజీలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత్‌ పట్టుబిగించినట్లు భావించాల్సిందే. న్యూజిలాండ్‌ను తొలిఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌట్‌ చేసి, కట్టడి చేసిన భారత వీరులు.. మ్యాచ్‌ను గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రెండో టెస్టు తొలిరోజు 7 వికెట్లు కోల్పోయి అభిమానులకు మూడో రోజు నాటికి వారి ఇన్నింగ్స్‌ను ముగించారు. ఇప్పుడిక ఎంత త్వరగా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ లో భారీ స్కోరు చేసి, ఆ లక్ష్యాన్ని వారి ముందుంచి, విజయం దిశగా నడిపిస్తుందనేది కీలకం.

న్యూజీలాండ్‌తో రెండో టెస్టు కోల్‌కత లోని ఈడెన్‌ గార్డెన్స్‌లో సెప్టెంబరు 30 న ప్రారంభం అయింది. ఒకవైపు వికెట్లు పడిపోతూ ఉన్నా.. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించి 300 దాటించి గౌరవప్రదమైన స్కోరు చేశారు. ఆ వెంటనే భారత పేసర్ల దాడికి న్యూజీల్యాండ్‌ తట్టుకోలేకపోయింది. పేసర్లకు స్వర్గధామంలా కనిపించిన ఈ పిచ్‌ మీద కుమార్‌ ఏకంగా అయిదు వికెట్లు తీశారు. ఆదివారం నాడు లంచ్‌కు ముందే న్యూజీలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ పోరాటం ముగిసింది. 204 పరుగులకే కుప్పకూలింది.

న్యూజీలాండ్‌ జట్టులో జెఎస్‌ పటేల్‌ చేసిన 47 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు అంటే.. వారి జట్టు ఎలాంటి పరిస్థితిలో కుప్పకూలిందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌కు ప్రస్తుతం 124 పరుగుల ఆధిక్యం ఉంది. నాలుగోరోజు చివరి సెషన్‌ లోగా భారత్‌ భారీ లక్ష్యాన్ని వారి ముందుంచి.. డిక్లేర్‌ చేయగలిగితే.. పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌ గెలుపు దిశగా వెళ్తుందా, డ్రా దిశగానా అనేది మన బ్యాట్స్‌ మెన్‌ ప్రదర్శించగల దూకుడు మీద ఉంది.

Similar News