మంత్రి గారి కుమారుడిపై కేసు నమోదు

Update: 2017-02-14 11:32 GMT

తెలంగాణలో ఓ మంత్రి కుమారుడు హల్ చల్ చేశాడు. చిరు వ్యాపారులపై చిందులేశాడు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తనయుడు రామేశ్వర్ గౌడ్ అతని అనుచరులు తనపై దాడి చేశారని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుట్ పాత్ ఆక్రమణల తొలంగింపు వ్యవహారంలో జరిగిన వాదన చివరకు ఘర్షణ దాకా వెళ్లిందని వ్యాపారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సికింద్రాబాద్ పాత మార్కెట్ వద్ద పచ్చళ్ల వ్యాపారం చేసుకుంటున్న మోహిత్ రాథోడ్ దుకాణాన్ని తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వచ్చారు. వీరితో పాటు మంత్రి కుమారుడు రామేశ్వర్ గౌడ్, అతని స్నేహితులు కూడా అక్కడకు వచ్చారు.

అయితే మోహిత్ రాధోడ్ తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, కావాలంటే ప్లాన్ చూసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరాడు. అయితే అక్కడే ఉన్న మంత్రి కొడుకు అతని అనుచరులు తనతో పాటుగా తన కుటుంబసభ్యులపైనా దాడి చేశారని వ్యాపారి మోహిత్ రాథోడ్ ఆరోపిస్తున్నారు. దీనిపై వ్యాపారి మోహిత్ సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మంత్రి కుమారుడు రామేశ్వర్ గౌడ్ తోపాటుగా అతని అనుచరులు మధు, అరుణ్, సాయి, అరవింద్ రాధోడ్, అభిషేక్, ఇంబ్రాన్ లపై 341, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News