భూవివాదంలో తెలంగాణా మంత్రి!

Update: 2016-03-31 16:17 GMT

మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు భూ వివాదంలో చిక్కుకున్నారు. తన భర్త రామ కోటేశ్వరరావును మంత్రి తలసాని తనయుడు సాయి యాదవ్ కిడ్నాప్ చేశారని ఆంధ్రప్రదేశ్ లోని అరకు ఎంపీ వంగపల్లి గీత షేక్ పేట పోలీసులకు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. తమకు చెందిన ఐదెకరాల భూమికి సంబంధించి వివాదం పరిష్కారానికి సాయి యాదవ్ తన భర్తను చర్చలకు పిలిచారని, అయితే ఆయన ఎంతకూ తిరిగి రాకపోవడంతో గీత పోలీసులను ఆశ్రయించారు. అయితే ఎంపీ గీత భర్త రామ కోటేశ్వరరావు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చారు. భూ వివాదానికి సంబంధించి తమకు చెందిన ఐదెకరాల భూవివాదంపై ఆర్ఆర్ కన్ స్ట్రక్షన్ కు చెందిన రామకృష్ణ, మంత్రి కుమారుడు తనను ఓ హోటల్ కు చర్చలకు పిలిచి బయటకు రాకుండా చేశారని, తన దగ్గర ఉన్న దస్తావేజులు లాక్కున్నారని, ఖాళీ దస్తావేజులపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని రామ కోటేశ్వరరావు పంజగుట్ట పోలీసులకు బుధవారం అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. దీనితో మంత్రి కుమారుడిపై సెక్షన్ 384, సెక్షన్ 342 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.అయితే ఈ ఆరోపణలను మంత్రి శ్రీనివాస యాదవ్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నాప్ చేయాలనుకుంటే ఎవరైనా హోటల్ కి తీసుకువెళతారా అని ప్రశ్నించారు. తన కుమారుడు, హోటల్ లాన్ లో కూర్చుని మాట్లాడుకున్నారని, కావాలంటే సీసీ కెమెరాల పుటేజ్ చూడవచ్చని అన్నారు. భూ వివాదంతో తన కుమారుడికి ఎటువంటి సంబంధం లేదని, రామ కోటేశ్వరరావు బ్యాంకులను మోసం చేశారని, తమను మోసం చేయాలంటే కుదరదని మంత్రి అన్నారు.

Similar News