భార్యా బిడ్డలపై ఎంత కసి?

Update: 2018-03-22 02:21 GMT

వంశమే మిగలకూడదనే దురుద్దేశ్యం ఆ కిరాతకుడిది. భార్యా భర్తల మధ్య చిన్న తగాదాలే మూడు హత్యలకు దారి తీసింది. కట్టుకున్న ఇల్లాలితో పాటు...కన్నబిడ్డల్ని చంపేసిన ఆ కసాయిని కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. మెదక్ జిల్లా రామచంద్రాపురం ఇందిరానగర్ భీమ్ కాలనీలో నివాసం ఉండే సురేందర్ లింగంపల్లిలో ఆటో ఇంజనీరింగ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. మెకానిక్ గా పనిచేసే సురేందర్ బడంగ్ పేట్ కు చెందిన వరలక్ష్మిని వివాహమాడాడు. కొంత కాలం పాటు వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కలిగారు. ఆరేళ్ల కుమారుడు రితేష్, మూడేళ్ల యశస్విని సంతానం. ఉగాది పండక్కి రావాలని అల్లుడి కుటుంబాన్ని మీర్ పేట్ బడంగ్ పేట్ లో నివాసముండే అత్తామామలు ఆహ్వానించారు. ఈనెల 19వ తేదీన కుటుంబంతో కలిసి బడంగ్ పేట్ లోని ప్రభు హోమ్స్ కు వెళ్లాడు. పుట్టింటికి వచ్చి సంతోషంతో ఉన్న భార్యని చూసిన భర్త రగిలిపోయాడు. తనవాళ్లు వచ్చినప్పుడు ఎప్పుడూ భార్య కస్సుబుస్సులాడేదని.. ఇంట్లోకి కూడా తనవాళ్లని రానిచ్చేదని కాదని భార్యతో గొడవపడ్డాడు.

వాగ్వాదం చివరకు...

ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. ఆవేశానికి లోనైన సురేందర్ భార్య వరలక్ష్మిని నెట్టివేసి కిందపడేశాడు. భార్య గుండెలపై కూర్చొని ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో బెడ్ పై నిద్రిస్తున్న మూడేళ్ల యశస్విని గొంతు నులిమి ప్రాణం తీశాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల కుమారుడు రితేష్ ని లోపలికి పిలిచి.. వీడియో గేమ్స్ నేర్పుతానని నమ్మించి అతని పీకనులిమాడు. మూడు హత్యలు చేశాక ఇంటి నుంచి పారిపోయాడు ఆ దుర్మార్గుడు. పండక్కి ఇంటికొచ్చిన అల్లుడికి మర్యాదలు చేసేందుకు సురేందర్ మామ కల్లు తేవడానికి వెళ్లాడని.. అతని అత్త సరుకులు తేవడానికి దుకాణానికి వెళ్లిన సమయాన్ని అదునుగా చూసి ఈ దురాగతానికి పాల్పడ్డాడని చెప్పారు పోలీసులు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే మీర్ పేట్ లో జరిగిందని అంటున్నారు. భార్యాబిడ్డల్ని చంపిన సురేందర్ పై రౌడీషీట్ తెరుస్తామని.. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామంటున్నారు పోలీసులు.

Similar News