బ్రేకింగ్ : లోక్ సభ రేపటికి వాయిదా...ఎప్పటిలాగానే

Update: 2018-03-20 06:47 GMT

లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వాయిదా పడిన అనంతరం ప్రారంభమైన లోక్ సభలో మళ్లీ గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్ లోకి వెళ్లి మరీ ఆందోళన చేశారు. కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ ఆందోళనలు చేస్తూనే ఉంది. నిరసనల మధ్యనే స్పీకర్ సభా కార్యక్రమాలు చేపట్టారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన చేస్తున్నా సభ్యులు ఆందోళన విరమించలేదు. ఇరాక్ లో భారతీయులకు సంబంధించిన అంశంపై సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తున్నప్పటికీ ఆందోళన విరమించలేదు. ఇరాక్ లో ఐసిస్ కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులు చనిపోయారని, దానికి సంబంధించి సభ్యులు శాంతియుతంగా వినాలని సుష్మా కోరారు. కిడ్నాప్ అయిన భారతీయులను మొసూల్ లో దారుణంగా హత్య చేశారని సుష్మా వెల్లడించారు. భారత్ నుంచి పంపిన డీఎన్ఎ శాంపిల్స్ ఆధారంగా నిర్ధారించామని చెప్పారు. సాటి భారతీయులు హత్య కు గురైనా మానవత్వం లేదా? అని ఆందోళన చేస్తున్న సభ్యులను సుష్మా ప్రశ్నించారు. వెల్ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా కూడా సభ్యులు శాంతించలేదు. ఈ గందరగోళం మధ్యనే ప్రభుత్వంపై వైసీపీ, టీడీపీ అవిశ్వాస తీర్మానాలను చదివి విన్పించారు. అవిశ్వాసంపై చర్చకు అనుమతించాలంటే సభ ఆర్డర్ లో ఉండాలని, ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ పదే పదే కోరారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సభను రేపటికి స్పీకర్ వాయిదా వేశారు. సభ్యుల తీరు ఆక్షేపణీయమన్నారు సుమిత్రా మహాజన్. సభ సజావుగా జరిగితేనే అవిశ్వాసం పెట్టగలమని స్పీకర్ పదే పదే చెప్పారు.

Similar News