బీజేపీ అంటే భారతీయ జనతా పరేషన్

Update: 2016-11-17 14:36 GMT

నోట్ల రద్దు, నల్ల ధనం నియంత్రణకు మోడీ సర్కార్ తీసుకున్న చర్యల వలన, కొన్ని రోజుల పాటు జనానికి తప్పవు అనుకున్న కష్టాలన్నీ ఇంకా ఒక కొలిక్కి రాకముందే, పార్లమెంట్ సమావేశాలు మొదలు కావడం విపక్షాలకు బాగా కలిసొచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు భయంకరంగా వేడెక్కాయి. విపక్షాలన్నీ మూకుమ్మడి దాడులకు దిగుతున్నాయి. ప్రభుత్వం మంత్రులు ఎంతగా సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ , వీరు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు.

నోట్ల రద్దు కారణంగా 40 మరణాలు సంభవించాయంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మరో వైపు మమత దీదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలనే డిమాండ్ పై వెనక్కు తగ్గడం లేదు. రెండు రోజుల్లోగా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తానంటూ మమతా బెదిరిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాలకపక్షం మీద విరుచుకుపడుతున్నారు. మోదీ పార్లమెంటుకు జవాబు చెప్పాల్సిందేనంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకుడు సుధాకరరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అంటే.. భారతీ జనతా పార్టీ కాదని.. భారతీయ జనతా పరేషాన్ అన్నట్లుగా వారి వ్యవహారం జనాన్ని ఇబ్బంది పెడుతున్నదని వ్యాఖ్యానించడం గమనార్హం.

 

Similar News