బారాషహీద్‌కు చంద్రబాబు : అమరావతి రొట్టె; పోలవరం రొట్టె

Update: 2016-10-13 04:02 GMT

నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే రొట్టెల పండుగలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం పాల్గొన బోతున్నారు. ఈ సందర్భంగా రొట్టెలు విడిచి చంద్రబాబునాయుడు ముస్లిం సోదరులు పాటించే సాంప్రదాయం ప్రకారం మొక్కుకుంటారు.

మొహర్రం పర్వదినం రోజుల్లో నెల్లూరు చెరువు బారాషహీద్ దర్గా వద్ద వివిధ కోరికలు కోరుకుంటూ, తీరిన కోరికలకు మొక్కులు చెల్లించుకుంటూ రొట్టెలు విడవడం అనేది సుమారు తొమ్మిది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. పెళ్లి రొట్టె, పిల్లల రొట్టె, సంతాన రొట్టె ఇలా విడివిడిగా రొట్టెలు ఉంటాయి.

1930లో ఆర్కాట్ నవాబు తన భార్యకు అనారోగ్యం నయం చేసినందుకు గాను.. ఇక్కడ చెరువు వద్ద సమాధి అయిన బారాషహీద్ లకు మొక్కు చెల్లించి రొట్టెలు పంచిపెట్టారని, అప్పటినుంచి రొట్టెల పండుగ ఒక సాంప్రదాయంగా ప్రారంభం అయిందని చెబుతారు. కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా.. హిందువులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొని తమ తమ కోర్కెలతో రొట్టెలు విడవడం ఇక్కడ ఆనవాయితీ.

అలాంటి సాంప్రదాయ ప్రాశస్త్యం ఉన్న రొట్టెల పండుగలో ఇవాళ రెండోరోజు చంద్రబాబునాయుడు పాల్గొనబోతున్నారు. ఆయన అమరావతి రొట్టె, పోలవరం రొట్టె విడుస్తారని అంటున్నారు. అమరావతి నగర నిర్మాణం, పోలవరం 2018లోగా పూర్తి చేయడం అనే లక్ష్యాలు అధిగమించేలా అనుగ్రహించాలని చంద్రబాబు బారాషహీద్ లను కోరుకుంటూ రొట్టెలు విడుస్తారని చెబుతున్నారు.

Similar News