31 జిల్లాలతో సరికొత్త స్వరూపంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు బంగరు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నది. అయితే జిల్లాల ఏర్పాటు మీద విమర్శలు అనేది గతించిపోయిన ఎపిసోడ్ అయినప్పటికీ.. ఇంకా విపక్ష నాయకులు మాత్రం ఇంకా తమ విమర్శల దాడులను మానుకోలేదు. ఇలాంటి నేపథ్యంలో విపక్షాలు అశాస్త్రీయ జిల్లాల ఏర్పాటు అంటూ ఆడిపోసుకోవడమూ, తెరాస నేతలు ప్రతిదాడులకు తిట్టిపోయడమూ జరుగుతూనే ఉంది. అయితే తెరాస పార్టీ కార్యాలయంలో కొందరు నాయకుల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నదట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ తో సమానంగా జనాన్ని సమీకరించి పోరాడిన ఘనుడు ప్రొఫెసర్ కోదండరాం గురించిన ప్రస్తావన వారి మధ్య నడుస్తోందిట.
నిజానికి ప్రొఫెసర్ కోదండరాం రైతుల అంశాల విషయంలో , వారి ఆత్మహత్యల విషయంలో కేసీఆర్ సర్కారును ఇబ్బంది పెట్టేలా చాలా సార్లు మాట్లాడారు. అయితే.. ప్రతిసారీ కోదండరాం పేరు చెప్పకుండా.. కాంగ్రెస్ శక్తులు వెనుకనుంచి కీ ఇస్తోంటే మాట్లాడినట్లుగా ప్రొఫెసర్ సాబ్ గురించి కేసీఆర్ కామెంట్లు చేసినట్లుగా అప్పట్లో పుకార్లు వచ్చాయి. అయితే కాలక్రమంలో తాను ప్రజల తరఫున రాజకీయ ఉద్దేశాలు లేని పోరాటం చేయడానికి సదా సిద్దంగా ఉంటాననే సంకేతాలను ప్రొఫెసర్ కోదండరాం ప్రజల్లోకి పంపగలిగారు.
కోదండరాంకు ఎటూ జనం దృష్టిలో క్రెడిబిలిటీ ఉంది. తటస్థుడిగా , మంచి చెడులను ఉన్నదున్నట్లుగా మాట్లాడుతారనే పేరుంది. ఇప్పుడు జిల్లాల విషయంలో కోదండరాం ఎక్కడా నెగటివ్ గా నోరు మెదపడం లేదు గనుక.. ఆయన మద్దతు తమ పార్టీకి ఉన్నట్లే అని, తాము చేస్తున్న విభజనలో లోపాలు లేనట్లేనని తెరాస పార్టీలోనే కొందరు నాయకులు తమలో తమ సంభాషణల్లో అనుకుంటున్నారట. అయితే కొత్త జిల్లాల విభజన మీద జరిగే పోరాటానికి కూడా మద్దతిచ్చి తమ వెంట నిలవాల్సిందిగా కాంగ్రెస్ నేతలు కోదండరామ్ ను అడిగారని, అయితే ఆయన సున్నితంగా తిరస్కరించారని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.