ప్రపంచ కబడ్డీ ఫైనల్ సమరం : భారత్ vs ఇరాన్

Update: 2016-10-22 03:00 GMT

ప్రపంచ కబడ్డీ యోధులెవరో ఇవాళ సాయంత్రం తేలిపోతుంది. గుజరాత్ అహ్మదాబాద్ లో ఇవాళ సాయంత్రం 7 గంటలకు అంతిమపోరాటం జరగబోతోంది. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్లుగా, రన్నరప్ జట్టుగా ఉన్న భారత్, ఇరాన్ దేశాలే మళ్లీ తలపడబోతున్నాయి. రెండు పూల్ లలో ఉన్న ఈ జట్లు చివరికి తుది సమరానికి కూడా చేరుకున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన సెమీస్ మ్యాచ్ లలో ఇరాన్, కొరియా మీద విజయం సాధించింది. అదే సమయంలో భారత్, థాయ్‌లాండ్ మీద చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆ రీతిగా రెండు దేశాలూ ఫైనల్‌కు చేరుకున్నాయి.

తొలి సెమీస్ మ్యాచ్ లో కొరియా, ఇరాన్ లు హోరాహోరీగా తలపడ్డాయి. తాము ఆడిన మొదటి మ్యాచ్ లోనే ఛాంపియన్లు భారత్ ను ఖంగు తినిపించిన కొరియా, దీటైన ప్రత్యర్థిగా ఇరాన్ తో తలపడింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరాన్ మీద పైచేయి కూడా సాధించింది. అయితే ఇరాన్ జట్టు అనుభవం, వ్యూహం, స్ట్రెంగ్త్ ముందు కొరియా సెకండాఫ్ లో నిలవలేకపోయింది. పోటాపోటీ మ్యాచ్ లో ఇరాన్ ఫైనల్ కు చేరుకుంది.

రెండో సెమీస్ మాచ్ భారత్, థాయిలాండ్ ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం గురించి ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. కాకపోతే.. భారత్ ఎంత తేడాతో విజయం సాధిస్తుంది అన్నదే అంతా ఎదురుచూశారు. థాయిలాండ్ కూడా భారత్ తో సెమీస్ ఆడడం తమ కల అంటూ.. భారత్ ఆధిపత్యాన్ని ముందే ఒప్పేసుకుంది. మ్యాచ్ లో కూడా ఒక దశలో.. తమ జట్టులో ఒకే డిఫెండర్ మిగిలినప్పుడు, భారత రైడర్ రాగానే.. అసలు పోరాడకుండా అవుటైపోయి వెళ్లడంలోనూ వారి ధోరణి తేలిపోయింది.

భారత్- థాయిలాండ్ మ్యాచ్ పసికూనలతో రారాజులు తలపడిన మ్యాచ్ లాగా జరిగింది. నిజానికి సెమీస్ గనుక.. ఇది కూడా రంజుగా ఉండాల్సిందే గానీ.. పూర్తి ఏకపక్షంగా సాగింది. భారత్ 73-20 స్కోరు తేడాతో.. ఏకంగా 53 పాయింట్ల వ్యత్యాసంతో సెమీస్ ను నెగ్గడం విశేషం. భారత్ అనుభవం ముందు థాయ్ విలవిల్లాడిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఏకంగా వారిని నాలుగుసార్లు ఆల్ అవుట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు.

శనివారం రాత్రి అంతిమపోరాటం జరుగుతుంది. ఇప్పటిదాకా పరిస్థితులు భారత్ కే అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ ఛాంపియన్‌షిప్ మీద కన్నేసి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ప్రతిఘటన ఇస్తుందో చూడాలి.

Similar News